కమలం కమాల్​

కమలం కమాల్​
  • పంజాబ్​లో ‘ఆప్​’కీ సర్కార్.. కాంగ్రెస్ అట్టర్​ ఫ్లాప్
  • యూపీలో మళ్లీ యోగి రాజ్యం.. ప్రతిపక్షానికే పరిమితమైన ఎస్పీ
  • ఫలించని అన్నాచెల్లెలు రాహుల్, ప్రియాంక వ్యూహం
  • ఒకే ఒక్క సీటు గెలిచిన బీఎస్పీ.. ఊసులో లేని ఎంఐఎం
  • ఉత్తరాఖండ్, మణిపూర్​లో సత్తాచాటిన కమలనాథులు
  • గోవాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ఎంజీపీ, ఇండిపెండెంట్ల మద్దతు
  • 255  సీట్లలో బీజేపీ ఘన విజయం  
  • 111  స్థానాలతో సరిపెట్టుకున్న ఎస్పీ 
  • బీఎస్పీకి 1.. కాంగ్రెస్ కు 2 సీట్లే  
  • లక్షకుపైగా మెజార్టీతో సీఎం యోగి గెలుపు 
  • సీట్లు తగ్గిన ఓట్ల శాతం పెంచుకున్న బీజేపీ

కమలం.. మళ్లోసారి కమాల్​ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసింది. ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మణిపూర్​, గోవాలో విజయఢంకా మోగించింది. 2024 లోక్​సభ ఎన్నికలకు సెమీఫైనల్స్​గా భావిస్తున్న ఈ ఎలక్షన్స్​లో బీజేపీ సత్తా చాటింది. పంజాబ్​లో కాంగ్రెస్​ పార్టీని ఆప్​ ఊడ్చేసింది. ఇన్నాళ్లూ ఢిల్లీకే పరిమితమైన ఆమ్​ ఆద్మీ.. ఇప్పుడు మరో రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడంతో దేశ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. కాంగ్రెస్​ గ్రాఫ్​ ఇంకింత  కిందికి దిగజారింది. అధికారంలో ఉన్న పంజాబ్​ను కోల్పోవడమే కాక.. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్​లో కేవలం 2 సీట్లకే పరిమితమైంది. 

లక్నో: యూపీలో మళ్లీ బీజేపీకే జనం జై కొట్టిన్రు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వరుసగా రెండోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. మోడీ-– యోగి కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా దూదిపింజలా తేలిపోయింది. నిరుద్యోగులు, రైతులు, కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ.. అభివృద్ధి నినాదానికే ప్రజలు ఓటేశారు. ఎన్నికలకు ముందు కీలక నేతలు సైతం బీజేపీని వీడి ఎస్పీలో చేరినా.. యోగి సర్కారు సునాయాసంగానే గెలుపు తీరం దాటింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం.. బీజేపీకి ఈ సారి సీట్లు తగ్గిపోయాయి. ఎస్పీకి భారీగా సీట్లు పెరిగాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉండగా, మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 202 మార్కును దాటి 255 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఈసారి ఓట్లను, సీట్లను పెంచుకున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేక 111 సీట్ల దగ్గరే ఆగిపోయింది. కాంగ్రెస్ 2 సీట్లకే పరిమితం కాగా, బీఎస్పీ 1 సీటు మాత్రమే గెలవగలిగింది. ఇక ఎంఐఎం, ఆర్ఎల్డీ వంటి ఇతర పార్టీలు సోదిలో లేకుండా పోయాయి. ప్రధానంగా బీఎస్పీ ఈ ఎన్నికల్లో అటు ఓట్లను, ఇటు సీట్లను కోల్పోయి అతి దారుణంగా ఓటమిపాలైంది. 

బీజేపీకి తగ్గినయ్.. ఎస్పీకి పెరిగినయ్ 
2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 312 సీట్ల బంపర్ మెజార్టీ వచ్చింది. ఈ సారి కూడా ఘన విజయం సాధించినా 57 సీట్లు తగ్గాయి. మరోవైపు గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన ఎస్పీ.. ఈసారి 64 సీట్లను పెంచుకుని 111 సీట్లు సాధించింది. ఇక కాంగ్రెస్ గత ఎన్నికల్లో 7 సీట్లు గెలవగా, ఈసారి మరో ఐదింటిని కోల్పోయింది. బీఎస్పీ 19 సీట్ల నుంచి 1 సీటుకు పడిపోయింది. 

లక్ష ఓట్ల మెజార్టీతో యోగి గెలుపు 
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. గోరఖ్ పూర్ అర్బన్ నుంచి పోటీ చేసిన యోగి.. సమాజ్ వాదీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్ శుక్లాపై 1,02,892 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యోగికి మొత్తం 1,62,961 ఓట్లు రాగా, శుక్లాకు 60,069 ఓట్లు వచ్చాయి. ఇదే సీటులో ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) నుంచి పోటీ చేసిన చంద్ర శేఖర్ ఆజాద్ కేవలం 7,458 ఓట్లే పొందగలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో యోగి పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఎమ్మెల్సీ పదవి ఆధారంగానే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరోవైపు సీరథు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఎస్పీ అభ్యర్థి డాక్టర్ పల్లవి పటేల్ చేతిలో ఓటమిపాలయ్యారు. 

కర్హాల్ నుంచి అఖిలేశ్ గెలుపు 
సమాజ్ వాదీ పార్టీ చీఫ్​అఖిలేశ్ యాదవ్ కర్హాల్ స్థానం నుంచి 67,504 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అఖిలేశ్ కు మొత్తం 1,48,196 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత, కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కు 80,692 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆజంగఢ్ నుంచి ఎంపీగా ఉన్న అఖిలేశ్ యాదవ్.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. 

ఓబీసీ నేత ఎస్పీ మౌర్య ఓటమి 
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన ప్రముఖ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఓడిపోయారు. యోగి ఆదిత్యనాథ్ సర్కారులో కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా పని చేసిన మౌర్య ఎస్పీలో చేరడంతో.. బీజేపీ ఓబీసీ ఓట్లను భారీగా కోల్పోవాల్సి వస్తుందని అంచనా వేశారు. కానీ  ఆయనే అనూహ్యంగా ఓటమిపాలయ్యారు.ఫజిల్ నగర్ నుంచి పోటీచేసిన మౌర్యపై బీజేపీ అభ్యర్థి సురేంద్ర కుమార్ కుశ్వాహ 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

రాజ్ నాథ్ కొడుకు ఘనవిజయం 
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొడుకు, యూపీ డిప్యూటీ సీఎం పంకజ్ సింగ్ నోయిడా నియోజకవర్గం నుంచి 1,81,513 ఓట్ల రికార్డ్ మెజారిటీతో ఘన విజయం సాధించారు.  

జైలు నుంచి.. పదోసారి!
భూకబ్జాలు, క్రిమినల్ యాక్టివిటీస్ కు సంబంధించి 80 కేసులను ఎదుర్కొంటూ, జైలులో ఉన్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత మహ్మద్ ఆజం ఖాన్ రాంపూర్ నియోజకవర్గం నుంచి పదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, అడ్వకేట్ ఆకాశ్ సక్సేనాపై ఆయన భారీ ఆధిక్యంతో గెలిచారు. గతంలో ఆకాశ్ తండ్రి శివ్ బహదూర్ సక్సేనా కూడా ఆజంఖాన్ చేతిలో ఓడిపోయారు. అయితే, ఆజం ఖాన్ పై నమోదైన కేసుల్లో సగం కేసులు ఆకాశ్ సక్సేనా ఫైల్ చేసినవే ఉన్నాయి. 
ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం వారణాసి పరిధిలో 8 అసెంబ్లీ సీట్లు ఉండగా, ఆరింటిలో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. రెండు స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంది. 2017 ఎన్నికల్లో వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అన్ని స్థానాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి.

లఖీంపూర్​లో బీజేపీ క్లీన్ స్వీప్  
యూపీలోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రా వెహికల్ తో నలుగురు రైతులను తొక్కించి చంపిన ఘటన కారణంగా ఇక్కడ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని విశ్లేషకులు భావించారు. కానీ.. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ గెలిచి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రైతుల హత్య జరిగిన నిఘాసన్ నియోజకవర్గంలో సైతం సమాజ్ వాదీ అభ్యర్థి ఆర్ఎస్ కుశ్వాహపై బీజేపీ అభ్యర్థి శశాంక్ వర్మ 41 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అజయ్ మిశ్రాను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసినా, కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కొడుకు చేసిన తప్పుకు తండ్రిని శిక్షించడం కరెక్ట్ కాదని సమర్థించింది. దీంతో ఇక్కడ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని భావించగా.. ఇలా అన్ని చోట్లా విజయం దక్కడంతో ప్రతిపక్షాలు విస్తుపోయాయి.   

ప్రతిపక్షానికి గుణపాఠం చెప్పిన్రు 
ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించడం ద్వారా ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. మేం ప్రజల కోసం పని చేస్తుంటే.. వాళ్లు మాత్రం బురద చల్లడమే పనిగా పెట్టుకున్నరు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. బీజేపీకి మళ్లీ భారీ విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం వల్లే యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు సాధ్యమైంది.  

ఈ ఫలితాలు  2024  లోక్​సభ ఎన్నికల ఫలితాలకు సంకేతం. బీజేపీ విజయంలో మహిళలు, యువతది కీలక పాత్ర. కుల, వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని మరోసారి ఓటర్లు చాటిచెప్పారు. అభివృద్ధికే పట్టం కట్టారు. ప్రజా ధనాన్ని దోచుకునెటోళ్లను వదిలిపెట్టేది లేదు. అవినీతిపై విచారణ జరిగి తీరుతుంది.
‑ ప్రధాని నరేంద్ర మోడీ

ప్రతిపక్షాలకు గుణపాఠం 
తప్పుడు ప్రచారాలు చేసిన ప్రతిపక్షాలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. మేం ప్రజల కోసం పని చేస్తుంటే.. వాళ్లు మాత్రం బురద చల్లడమే పనిగా పెట్టుకున్నరు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడం వల్లే యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు సాధ్యమైంది.  
‑ యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం

బుజ్జగింపు రాజకీయాలు చేసేటోళ్లకు బుద్ధిచెప్పిన్రు 
ఉత్తరప్రదేశ్ లో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల నుంచి బీజేపీకి మద్దతు లభించింది. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు ఇలా అందరిలోనూ బీజేపీ సోపోర్టర్లు ఉన్నారు. బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకునే నేతలకు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. బీజేపీ తప్ప మరో పార్టీ మంచి పాలనను అందించలేదని ఈ తీర్పుతో చాటిచెప్పారు. 
- అపర్ణా యాదవ్, బీజేపీ నేత (ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు) 

హార్డ్ వర్క్ ను ఓట్లుగా మార్చుకోలేకపోయినం  
మా పార్టీ కార్యకర్తలు, నేతలం చాలా కష్టపడినం. ప్రజా సమస్యలపై కొట్లాడినం. కానీ మా హార్డ్ వర్క్ ను ఓట్ల రూపంలోకి మలచుకోలేకపోయినం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం. ఇకపైనా యూపీ, ప్రజల అభివృద్ధి కోసం పాజిటివ్ ఎజెండాతో ముందుకు వెళ్తాం. ప్రతిపక్ష పాత్రలో పూర్తి బాధ్యతతో పోరాడతం. 
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ