
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. నైనిటాల్ ఉధమ్ సింగ్ నగర్ ఎంపీ స్థానం నుంచి కేంద్ర రక్షణ, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి ప్రకాశ్ జోషిపై దాదాపు 3,17,435 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అల్మోరా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి అజయ్ తామ్టా..కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ తామ్టాపై దాదాపు 2,08,816 మెజార్టీ సాధించారు.
పౌరీ గర్వాల్ స్థానం నుంచి బీజేపీ నేషనల్ మీడియా ఇన్‌చార్జి అనిల్ బలూనీ దాదాపు 1,30,313 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తరాఖండ్ పార్టీ ప్రెసిడెంట్ గణేశ్ గొడియాల్‌పై గెలుపొందారు. హరిద్వార్‌లో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ 94,543 ఓట్ల మెజారిటీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి వీరేందర్ రావత్‌పై విజయం సాధించారు.
తెహ్రీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మహారాణి మాల రాజ్యలక్ష్మి షా దాదాపు 2,03,796 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జోత్ సింగ్ గన్సోలాపై గెలుపొందారు.