మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్

 మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్

మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫోకస్  పెట్టారు. కాంగ్రెస్  పార్టీ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి సిద్ధం కావడంతో ఈ ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. 2018 ముందస్తు ఎన్నికల తరువాత అసెంబ్లీలో ఒకే సీటుకు పరిమితమైన బీజేపీ... బండి సంజయ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచింది. రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు ట్రిపుల్ ఆర్ గా ప్రాచుర్యం పొందారు. దీంతో.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం ద్వారా మరో ఎమ్మెల్యే సీటును సొంతం చేసుకోవడంతో పాటు.. బీజేపీ ఖాతాలో నాలుగవ ఆర్ ను చేర్చే దిశగా పావులు కదుపుతున్నారు. 

పాదయాత్ర లంచ్ బ్రేక్ లో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా, ఉప ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చించారు. టీఆర్ఎస్ కు ధీటుగా పోరాడుతున్న బీజేపీ రాష్ట్రశాఖ.. అధికార పార్టీని ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా కేడర్ ను సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సిద్ధం చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో బండి సంజయ్ ఉన్నారు. 

దుబ్బాక, హుజురాబాద్ లాగా.. పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి సీనియర్ నేతను మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల ఇంచార్జ్ గా నియమించాలని ఇప్పటికే బీజేపీ సీనియర్ నాయకులు సంజయ్ కు సూచించారు.  ఎ.పి. జితేందర్ రెడ్డి లక్కీ హ్యాండ్  అని ఆయనను ఇంచార్జీగా నియమిస్తే ఉప ఎన్నికల్లో గెలవడం ఖాయమనే భావన బీజేపీ శ్రేణుల్లో ఉంది. అయితే ఎవర్ని ఇంచార్జ్  గా నియమించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. పార్టీలో అందరితో సంప్రదించిన తరువాతే ఇంచార్జీని నియమించే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నట్లు తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీ సీనియర్  నాయకులు అందరి సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. మునుగోడులో పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్  రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్  నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే పలు దఫాలు  బండి సంజయ్ సమీక్షించారు. మునుగోడులో గౌడ్స్, రెడ్లతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, పద్మశాలి సామాజికవర్గాల వారు అధికంగా ఉన్నారు. దీంతో ఇంఛార్జీలను నియమించేటప్పుడు సామాజికవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఆయా వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు సెగ్మెంట్ లో క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివిధ సంస్థలతో పలు సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర నాయకత్వానికి నివేదికను పార్టీ రాష్ట్రశాఖ తరుపున పంపినట్టు సమాచారం.