
- టార్గెట్ 88 ఎంపీ సీట్లు
- తెలంగాణ, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపైనా దృష్టి
- హైదరాబాద్ వేదికగా మరోసారి కీలక సమావేశాలు
- ఈ నెల 28, 29 తేదీల్లో ఫుల్ టైమర్స్ మీటింగ్
- హాజరుకానున్న అమిత్ షా, నడ్డా, బీఎల్ సంతోష్
హైదరాబాద్, వెలుగు: దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక్కడి ఎంపీ సీట్లపై దృష్టిసారించింది. సౌత్‌లో మొత్తం 130 ఎంపీ సీట్లు ఉండగా, ఇందులో 88 సీట్లలో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా మరోసారి కీలక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అయింది. ఈ నెల 28, 29 తేదీల్లో సిటీ శివారు ఘట్కేసర్లో మీటింగ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తెలంగాణ ఇన్చార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర జాతీయ నేతలు పాల్గొననున్నారు. వీరితో పాటు 88 పార్లమెంట్ నియోజకవర్గాల విస్తారక్ (ఫుల్ టైమర్స్)లు కూడా హాజరు కానున్నారు.
పార్టీ బలహీనంగా ఉన్న, ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల పనితీరు, ఆయా కమిటీల నియామకం, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై విస్తారక్ ల నుంచి జాతీయ నేతలు సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరిని ఫుల్ టైమర్ గా బీజేపీ హైకమాండ్ ఇప్పటికే నియమించింది. వారు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ బలం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఫుల్ టైమర్స్ హైకమాండ్ కు రిపోర్టు ఇవ్వనున్నారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఆయా ఎంపీ సీట్లలో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై మీటింగ్ లో ఫుల్ టైమర్స్ కు జాతీయ నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ప్రవాసీ యోజనలో భాగంగా కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైకమాండ్ వీరి నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది.
తెలంగాణ, కర్నాటకపై స్పెషల్ ఫోకస్..
దేశ వ్యాప్తంగా 144 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని, ఆ సీట్లలో ఇప్పటి వరకు గెలవలేదని బీజేపీ హైకమాండ్ గుర్తించింది. వీటిలో సౌత్ లోని తెలంగాణ, ఏపీ, కేరళ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని సీట్లే ఎక్కువగా ఉన్నాయి. సౌత్ లో మొత్తం130 ఎంపీ సీట్లు ఉండగా, 88 సీట్లపై బీజేపీ దృష్టిపెట్టింది. ఇక్కడ గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపైనే ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. కర్నాటక, తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది.