
- కర్నాటకలో 1.11 లక్షల మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లైన సందర్భంగా సభ
- హాజరైన పార్టీ చీఫ్ ఖర్గే, సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్
హోసపేట(కర్నాటక): పెద్దలకు దోచిపెట్టడం బీజేపీ విధానమైతే, పేదలకు పంచిపెట్టడం కాంగ్రెస్ విధానమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేండ్లైన సందర్భంగా హోసపేటలో మంగళవారం సాధన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 1.11 లక్షల మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
2 వేల తండాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ఇప్పుడు ఆరో గ్యారంటీగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దీనిపై తాము ఎన్నికల్లో హామీ ఇవ్వనప్పటికీ, అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
మీ డబ్బులు మీకే ఇస్తున్నం..
కాంగ్రెస్ సర్కార్ ప్రజల డబ్బులను తిరిగి ప్రజలకే ఇస్తున్నదని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘నేరుగా పేదల అకౌంట్లలోనే డబ్బులు వేస్తామని ఎన్నికల టైమ్‌లో చెప్పాం. చెప్పిన ప్రకారం ఈరోజు వేలాది కోట్లు పేదల అకౌంట్లలో వేస్తున్నాం. మీరు ఈ డబ్బులను పిల్లల చదువులకు, ఆస్పత్రి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. మా సర్కార్ మీ డబ్బులను మీకే ఇస్తున్నది.
వివిధ పథకాల కింద పేదలు, దళితులు, ఆదివాసీలకు నేరుగా డబ్బులు అకౌంట్లలో వేస్తున్నది. అవి మార్కెట్‌లోకి వెళ్లి ఎకానమీ ఇంప్రూవ్ అవుతున్నది. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం దేశ సంపదనంతా కొంతమందికి దోచిపెడుతున్నది. ఇద్దరు, ముగ్గురు బిలియనీర్లకే పంచిపెడుతున్నది. వాళ్లు ఆ డబ్బులను లండన్, న్యూయార్క్, ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మీ గ్రామాలను మాత్రం అభివృద్ధి చేయడం లేదు” అని మండిపడ్డారు.
‘‘బీజేపీ మోడల్‌లో మీ డబ్బులన్నీ కొంతమంది కార్పొరేట్ల చేతుల్లోకి పోతున్నాయి. ఎంప్లాయ్‌మెంట్ లేకుండా పోతున్నది. కానీ కాంగ్రెస్ మోడల్‌లో మీ డబ్బులను మీకే ఇస్తున్నాం. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. బీజేపీ పాలనలో మీకు జబ్బు వస్తే ట్రీట్‌మెంట్‌కు అప్పు చేయాల్సిందే. కానీ మా పాలనలో మీ ట్రీట్‌మెంట్‌కు సరిపడా డబ్బులు మేం ఇస్తున్నాం. బీజేపీ పాలనలో మీ పిల్లల చదువులకు లక్షల రూపాయలు మీరు కట్టాల్సిందే. కానీ మేం మీ పిల్లల చదువులకు డబ్బులు ఇస్తున్నాం” అని చెప్పారు.
మరో 50 వేల మందికి పట్టాలు..
కర్నాటకలో చాలామంది పేదలకు భూమి ఉన్నప్పటికీ, వాళ్లకు పట్టాలు లేవని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘కర్నాటకలోని ఎన్నో తండాలు, చిన్న పల్లెల్లో ఆదివాసీలు, దళితులు నివాసం ఉంటున్నారు. వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించకపోవడంతో వాళ్లంతా అభివృద్ధికి దూరమవుతున్నారు. ప్రభుత్వ సౌకర్యాలు అందడం లేదు. దీనిపై ఎన్నికల టైమ్‌లో ఖర్గే, సిద్ధరామయ్యతో నేను చర్చించాను.
పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అది ఈరోజు పూర్తవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లక్ష మందికి పైగా పేదలకు ఇయ్యాల పట్టాలు అందిస్తున్నాం. ఇది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కలలను నిజం చేయడంలో కీలక ముందడుగు” అని చెప్పారు. ఇంకో 50 వేల మందికి ఇండ్ల పట్టాలు లేవని, వాళ్లకు కూడా ఆరు నెలల్లోపు ఇస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో భూమి ఉండి పట్టాలు లేని పేదలు ఎవరూ ఉండొద్దన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇప్పుడు 2 వేల తండాలు, చిన్న పల్లెలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించామని.. రానున్న రోజుల్లో ఇంకో 500 గ్రామాలను కూడా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.