బీజేపీది అన్యాయ్ కాల్ : దిగ్విజయ్ సింగ్

బీజేపీది అన్యాయ్ కాల్ : దిగ్విజయ్ సింగ్
  •  ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు 
  • రైతులపై ఇజ్రాయెల్ తరహా దాడులు చేస్తున్నది
  • డ్రోన్లతో టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన అమృత్ కాల్ కాదని, ఈ పదేండ్లు అన్యాయ్ కాల్ అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, ఎంపీ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాలు రాలేదని, ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు పడలేదని, నల్ల ధనాన్ని తీసుకురాలేదని అన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ అన్యాయ్ కాల్ త్వరలోనే ముగుస్తుందని, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పారు. గురువారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు.

 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ మాటలకే పరిమితమైందన్నారు. మోదీ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రైతులపై ఇజ్రాయెల్ తరహాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్టుగానే.. కేంద్ర ప్రభుత్వం కూడా డ్రోన్లతో టియర్ గ్యాస్ షెల్స్​ ప్రయోగిస్తున్నదని అన్నారు. సోనిక్ వెపన్స్​తో బెదరగొడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల కోసం ఢిల్లీకి వస్తున్న రైతులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో రోడ్లపై మేకులు కొట్టారని, ఇనుప, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇంత కన్నా దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఎంఎస్​పీకి చట్టబద్ధత కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

ఎంఎస్​పీ హామీ ఏమైంది?

కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ)కి చట్టబద్ధత కల్పించాలన్నది రైతుల డిమాండ్ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రెండేండ్ల కింద రైతులు ఢిల్లీలో ధర్నా చేశారని, చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన మోదీ దాన్ని మరిచారని గుర్తు చేశారు. ఆ డిమాండ్​తోనే రైతులు ఇప్పుడు మళ్లీ కేంద్రాన్ని నిలదీసేందుకు వస్తుంటే అప్రజాస్వామికంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు ఢిల్లీకి రాకుండా హర్యానాలోని పెట్రోల్ బంక్​లకు ఫ్యూయెల్ సప్లై ఆపేశారన్నారు. అక్కడి పెట్రోల్ బంకులన్నీ ఖాళీ అయ్యాయని తెలిపారు. సాధారణ ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.