గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతం

గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతం

GHMC ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో డివిజన్లు గెలుచుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పడానికి గ్రేటర్ ఎన్నికల ఫలితాలే నాంది అని స్పష్టం చేశారు. అహంకారంతో విర్రవీగే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నది మరోసారి తేలిందన్నారు. అంతేకాదు  బీజేపీ అభ్యర్థుల గెలుపును రాష్ట్రఎన్నికల కమిషనర్ పార్థసారధి,  DGP మహేందర్ రెడ్డికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు. కార్యకర్తల కంటే ఎక్కువగా SEC, DGP టీఆర్ఎస్ కోసం కష్టపడ్డారన్నారు. సారు, కారు, ఇక రారు.. 2023లో కారు షెడ్డుకు పోవటం ఖాయమన్నారు. అర్థరాత్రి ఎలక్షన్ కమిషనర్ తప్పుడు సర్క్యులర్ ను విడుదల చేయటం దారుణమన్నారు. మంత్రులకు,ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని సూచించారు.. గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతమన్నారు.గడీ నుంచి సీఎం కేసీఆర్ ను బయటకు తీసుకొస్తామన్నారు. గ్రేటర్ లో గెలిచిన తాము అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోబోమన్నారు. హైదరాబాద్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామన్నారు. సీట్లు మాత్రమే కాదు.. బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగాయన్నారు. జాతీయ నాయకుల ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందన్నారు బండి సంజయ్.