రాష్ట్రంలో అవినీతిమయ పాలన నడుస్తోంది : వివేక్ వెంకటస్వామి 

రాష్ట్రంలో అవినీతిమయ పాలన నడుస్తోంది : వివేక్ వెంకటస్వామి 

ఢిల్లీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ముందుచూపుతో అన్ని వర్గాలకు మేలు చేసేలా రాశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చాలా గొప్ప మేధావి అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కుటుంబ పాలన, అవినీతిమయ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ఆరోపించారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఆడిటోరియంలో కాన్స్టిట్యూషన్ డే కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పాండిచ్చేరి మంత్రి సాయి జే శరవణంకుమార్.. వివేక్ వెంకటస్వామిని పూలమాలతో సత్కరించారు.

రాజ్యాంగం రాసేటప్పుడే రాజకీయ నాయకులు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఉంటాయని అనాడే అంబేద్కర్ చెప్పారని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. ఇచ్చిన ఏ హామీలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడు ఎకారాల భూమి ఇవ్వలేదన్నారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం కోసమే ఏర్పడినట్లు ఉందన్నారు. అంబేద్కర్ అడుగు జాడల్లోనే కేంద్రంలో బీజేపీ పార్టీ నడుస్తోందని చెప్పారు. కేంద్ర కేబినెట్ లోనూ బడుగు, బలహీన వర్గాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని తెలిపారు.