ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి ఉద్రిక్తం

ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి ఉద్రిక్తం

ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  బంజారాహిల్స్ రోడ్​ నంబర్​ 14లోని కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు.  వీరిని పోలీసులు అడ్డుకోవటంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.  దీంతో బీజేవైఎం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం కేసుపై రాష్ట్ర సర్కార్ విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.  ఈసందర్భంగా బీజేవైఎం నాయకుడు గౌతమ్ రావు మాట్లాడుతూ.. ‘‘ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు వినిపిస్తోంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్సీ పదవికి కవిత  రాజీనామా  చేయాలి.  ఎమ్మెల్సీ పదవి నుంచి కవితను తొలగించాలి. విచారణ కు సహకరించాలి”అని పేర్కొన్నారు.  ‘‘రాష్ట్రంలో  మద్యం ఏరులై పారుతుంటే.. ఢిల్లీలో లిక్కర్ టెండర్లలో కవిత అవినీతికి  పాల్పడింది. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి  కేసీఆర్​ వెంటనే రాజీనామా చేయాలి”అని గౌతమ్​ రావు డిమాండ్​ చేశారు.  ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట నిరసన తెలుపుతుంటే.. పోలీసులు తమ పట్ల దారుణంగా వ్యవహరించి కొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.