డిగ్రీ లేకున్నా 14 ఏండ్లుగా లా ప్రాక్టీస్

డిగ్రీ లేకున్నా 14 ఏండ్లుగా లా ప్రాక్టీస్

ఆమె ఓ లాయర్.. 14 ఏండ్లుగా ప్రాక్టీస్ చేస్తోంది. వివిధ న్యాయస్థానాల్లో పలువురి తరఫున కేసులు వాదిస్తోంది. అయితే ఓ లాయర్ కు వచ్చిన అనుమానం ఆమె బండారాన్ని బయటపెట్టింది. చివరకు ఊచలు లెక్కపెట్టేలా చేసింది. 

ముంబై బాంద్రా వెస్ట్లోని పాలి హిల్కు చెందిన 72ఏండ్ల రెబెకా జౌబ్ అలియాస్ మందాకినీ కాశీనాథ్ సోహిని 2008 నుంచి లాయర్గా ప్రాక్టీస్ చేస్తోంది. ముంబయి ఫ్యామిలీ కోర్టుతో పాటు పలు న్యాయస్థానాల్లో అనేక మంది తరఫున కేసులు వాదిస్తోంది. అయితే బోరివలీకి చెందిన న్యాయవాది అక్బర్ అలీ మహమ్మద్ ఖాన్ ఆమె ఎలాంటి లా డిగ్రీ లేకుండానే ప్రాక్టీస్ చేస్తోందన్న అనుమానం రావడంతో జులైలో బీకేసీ పోలీసులకు కంప్లైట్ చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు జులై 15న విచారణకు రావాలని సోహినికి నోటీసులిచ్చారు. అయితే ఆమె పోలీసు విచారణకు డుమ్మా కొట్టింది. 

తాజాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సోహిని అక్కడ అధికారులకు తన డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ కార్డు, వకాలత్నామా అందజేసింది. వాటిని పరిశీలించిన అధికారులు ఆమె డిగ్రీ, వకాలత్ నామా నకిలీదని తేల్చారు. ఫ్రాడ్కు సంబంధించి మహారాష్ట్ర అండ్ గోవా బార్ కౌన్సిల్ కు సమాచారం అందించారు. అనంతరం సోహినీని అదుపులోకి తీసుకున్న బీకేసీ పోలీసులు బాంద్రా కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితురాలు సోహినీ 1977లో గవర్నమెంట్ లా కాలేజ్లో లా కోర్సులో చేరింది. అయితే సెకండ్ ఇయర్లోనే చదువు మానేసింది. కోర్సు పూర్తి చేయకపోవడంతో ఆమె చేతికి లా పట్టా అందలేదు. అయినా సోహినీ మాత్రం లాయర్ గా చలామణి అవుతూ ముంబైలోని పలు కోర్టుల్లో ప్రాక్టీస్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది.