
- రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను తరిమికొట్టాలని పిలుపు
- ముగిసిన రెండు రోజుల బీజేపీ విస్తారక్ల సమావేశాలు
- రాష్ట్రంలో ‘మిషన్ 90’ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం
- వర్చువల్‌గా నేతలతో మాట్లాడిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
- ఫిబ్రవరిలో బూత్ కమిటీల సమ్మేళనానికి ప్రధానిని ఆహ్వానిస్తం: సంజయ్
- తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి ఆ తల్లి రొమ్మును గుద్దుతున్నరు
- నాపై ఆరోపణలకు సరైన టైంలో సరైన సమాధానమిస్త
హైదరాబాద్, వెలుగు: ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మొదటిసారి స్పందించారు. తనపై ఆరోపణలు చేసినవాళ్లు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా కేసీఆర్‌ను ఆయన హెచ్చరించారు. ‘‘నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో నేనంటే ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు నా పేరును పాపులర్ చేశారు. నాపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు” అని ఆయన అన్నారు. తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి ఆ తల్లి రొమ్ము గుద్దుతున్నారని, తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆవు పాలు పిండుకోవాలి.. కానీ, ఆ ఆవునే చంపేందుకు ఇక్కడి పాలకులు ప్రయత్నిస్తున్నారు” అని బీఎల్ సంతోష్ అన్నారు. ఫామ్‌హౌస్ కేసులో తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలకు సరైన టైంలో సరైన జవాబిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతున్నదని, ఆ పాలనను తరిమికొట్టాలని బీజేపీ కేడర్‌కు ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన రెండురోజుల బీజేపీ సౌత్ పార్లమెంట్ విస్తారక్ల (ఫుల్‌టైమర్స్) సమావేశాలు గురువారం ముగిశాయి. ముగింపు సమావేశాల్లో బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పాలక్, ప్రభారి, కన్వీనర్, విస్తారక్ లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి పాలకుల తీరు ప్రజాస్వామ్యానికి శాపంగా మారిందన్నారు.
8 నెలల్లో ఎన్నికలు రావొచ్చు
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఆఫీసులను వెంటనే ఏర్పాటు చేయాలని, వచ్చే మూడు నెలల లోపు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని పార్టీ లీడర్లకు బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, వారానికి ఒకసారి మండలం, పదిహేను రోజులకు ఓసారి జిల్లా, నెలకోసారి రాష్ట్రస్థాయిలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని గుర్తించి ఆందోళన కార్యక్రమాలకు పక్కా ప్రణాళిక రెడీ చేసుకోవాలని ఆయన అన్నారు. ముఖ్య నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ లు పెట్టుకోవాలని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం దృష్టి పెట్టాలని, బూత్ కమిటీల బలోపేతంపైనా శ్రద్ధ చూపాలని సూచించారు. ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేతలు డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, మురళీధర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.
బూత్ కమిటీల సమ్మేళనానికి ప్రధానిని పిలుస్తం: సంజయ్
వచ్చే ఫిబ్రవరిలో బూత్ కమిటీల సమ్మేళనం నిర్వహిస్తామని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బీఎల్ సంతోష్ తో తెలంగాణ ముఖ్య నేతల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ‘మిషన్ 90’ పేరుతో 90 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా నాలుగంచెల వ్యూహంతో ముందుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని భావిస్తున్నారని చెప్పారు. బీఎల్ సంతోష్ హైదరాబాద్ రావడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని ఆయన అన్నారు. ‘‘కేసీఆర్ పార్టీలో తెలంగాణ లేదు. ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు పంపుతున్నడు” అని ఆరోపించారు. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయడానికి ఆ పార్టీ నేతలే సిద్ధంగా లేరని అన్నారు. బీజేపీకి ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే నెల 16 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తానని సంజయ్ చెప్పారు.
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే: తరుణ్ చుగ్
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పోయి బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ స్టేట్ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక, రాచరిక పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు.
కొన్ని నియోజకవర్గాల పాలక్‌లు:
మెదక్ -ధర్మపురి అర్వింద్
కుత్బుల్లాపూర్ - డీకే అరుణ
ఎల్లారెడ్డి - రఘునందన్‌రావు
రామగుండం - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
వరంగల్ తూర్పు - ఈటల రాజేందర్
ములుగు - సోయం బాపూరావు
మేడ్చల్ - లక్ష్మణ్
శేరిలింగంపల్లి - కిషన్ రెడ్డి
పరిగి - విజయశాంతి
జుక్కల్ - వివేక్ వెంకటస్వామి
జూబ్లీహిల్స్ - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
పటాన్‌చెరు- మురళీధర్‌రావు
మహేశ్వరం - పొంగులేటి సుధాకర్‌రెడ్డి
రాజేంద్ర నగర్ - మర్రి శశిధర్‌రెడ్డి
చేవెళ్ల - జితేందర్ రెడ్డి
పాలకుర్తి - బూర నర్సయ్యగౌడ్
రాష్ట్రంలోని పాలకులు హైదరాబాద్ సంపదను రాజకీయ అవసరాల కోసం దేశమంతా పంపుతున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ ను ఏటీఎంగా మార్చుకున్నారు. ఇక్కడి పాలకుల తీరు ప్రజాస్వామ్యానికి శాపం. కేసీఆర్ ఓ డిక్టేటర్.
- బీఎల్ సంతోష్