సూర్యాపేటలో 10 రోజులుగా నల్లా నీళ్లు బంద్​

సూర్యాపేటలో 10 రోజులుగా నల్లా నీళ్లు బంద్​

మిషన్ ​భగీరథ మెయిన్ పైప్ లైన్ దెబ్బతిని నిలిచిన వాటర్ సప్లై

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో పది రోజులుగా నల్లా నీళ్లు బంద్ అయ్యాయి. నేరేడుచర్ల వద్ద భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడంతో వాటర్​ సప్లై నిలిచిపోయింది. గుక్కెడు నీళ్ల జనం కోసం అల్లాడుతున్నారు. బిందెలు పట్టుకొని మున్సిపల్ ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. సరిపడా ట్యాంకర్లు లేకపోవడంతో ఓ కాలనీకి వాటర్ అందితే, ఓ కాలనీకి అందడం లేదు. క్వాలిటీ లేని పైపుల వల్లే ఈ పరిస్థితి తలెత్తగా, ఆఫీసర్లపై జనం నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో మిషన్ భగీరథకు బదులు గతంలో అమృత్ స్కీం కింద చేపట్టిన దోసపహాడ్ నుంచి వాటర్​ సప్లై చేసేందుకు ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు.

కరెంట్ ​కోతలతో అరకొరగానే.. 

అవంతిపురం టెయిల్​పాండ్ నుంచి చిట్యాల పంప్ హౌస్ కు నీరు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇమాంపేట 95 ఎం‌ఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శాంతినగర్ లో 1500 కే‌ఎం‌ఎల్‌డీ కెపాసిటీతో నిర్మించిన ట్యాంకర్​కు సప్లయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా సూర్యాపేటకు తాగునీరు సప్లై అవుతోంది. అయితే కరెంట్​కోతలతో అవంతిపురం టెయిల్ పాండ్ లోని మోటార్లు తరచూ పాడవుతున్నాయి. ఫలితంగా సూర్యాపేటకు సరిగా వాటర్​సప్లై జరగడం లేదు. దీనికి తోడు నేరేడుచర్ల వద్ద మెయిన్ పైప్ లైన్ కు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి.10 రోజుల కింద మరోసారి లీకేజీ ఏర్పడడంతో మిషన్​భగీరథ అధికారులు రిపేర్లు చేపట్టారు. అప్పటి నుంచి సూర్యాపేటలో నీటి కష్టాలు మొదలయ్యాయి. మున్సిపల్​అధికారులు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చిపోస్తున్నా సరిపోవడం లేదు. కొన్ని వార్డుల్లోనే పోస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లా నీళ్లు సప్లయ్​చేసేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ప్లాంట్ల ముందు బారులు

తాగునీటి సరఫరా బంద్​అవడంతో ప్యూరిఫైడ్, మినరల్ వాటర్ ప్లాంట్లకు జనం క్యూ కడుతున్నారు. జిల్లా కేంద్రంలో లక్షకుపైగా జనాభా ఉంది. మొత్తం18 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు 25 మిలియన్ లీటర్ల నీటి సప్లై చేయాల్సి ఉండగా ప్రస్తుతం 20 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఎండలు మరింత ముదిరితే మరో 4 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంది. 

దోసపహాడ్ నుంచి తెచ్చేందుకు ప్లాన్​

2015కి ముందు సూర్యాపేట మున్సిపాలిటీకి పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ పక్కనున్న అనాజిపురం చెరువు నుంచి నీటి సప్లై జరిగేది. 2015 తర్వాత మిషన్ భగీరథ నీళ్లు రావడంతో దోసపహాడ్ నుంచి సరఫరా నిలిచింది. దోసపహాడ్ నుంచి మళ్లీ సప్లై చేసేందుకు ఇటీవల రూ.15లక్షలతో మోటర్లకు రిపేర్లు చేయించారు. ట్రయల్ రన్ పూర్తిచేశారు.

నేతలు, అధికారుల ఫెయిల్యూర్​

సూర్యాపేటకు సరిపడా మంచినీటిని సరఫరా చేయడంలో పాలకులు, మున్సిపల్ అధికారులు పూర్తిగా ఫెయిల్​అయ్యారు. 10 రోజులుగా నల్లా నీళ్లు రాక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన అధికారులు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. తరచూ ఇదే పరిస్థితి ఉంటోంది. గతంలో దోసపహాడ్​నుంచి వేసిన పైపు లైన్ నుంచి నీటిని సరఫరా చేయాలి. స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
- పల్స మహాలక్ష్మి మల్సూర్ గౌడ్, కౌన్సిలర్, బీజే‌పీ 

మూడ్రోజుల్లో ట్రయల్​ రన్ ​పూర్తి చేస్తం

మిషన్ భగీరథ పైప్​లైన్ రిపేర్లు పూర్తయ్యాయి. మూడు రోజుల్లో ట్రయల్ రన్​పూర్తిచేసి నీటి సప్లయ్​ప్రారంభిస్తాం. త్వరలో దోసపహాడ్ నుంచి కూడా సప్లయ్ చేసేందుకు ప్లాన్​చేస్తున్నాం. మిషన్ భగీరథతోపాటు దోసపహాడ్ నీరు కూడా అందిస్తాం.
- పి.రామంజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట