
- అమెరికాలోని టెన్నెసీలో ఘటన
మెక్‌ఎవెన్: అమెరికాలో టెన్నెసీ స్టేట్లో విషాదం చోటుచేసుకుంది. హంఫ్రెయ్స్ కౌంటీలో ఉన్న అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ (ఏఈఎస్) ఎక్స్ప్లోజివ్ ప్లాంట్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కర్మాగారం పూర్తిగా నేలమట్టమైంది. అయితే, ఆ సమయంలో ప్లాంట్లో ఉన్న 18 మంది ఆచూకీ లేకుండా పోయిందని అధికారులు తెలిపారు.
వారంతా మృతి చెంది ఉంటారని చెప్పారు. మరో 4-5 మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ప్లాంట్లో ఏరోస్పేస్, డిఫెన్స్, డెమోలిషన్, మైనింగ్ పరిశ్రమలకు ఎక్స్ప్లోజివ్లు, ఎనర్జెటిక్ డివైస్‌లు తయారు చేస్తారు. విస్ఫోటం 24 కిలో మీటర్ల దూరంలోని నాష్విల్ వరకు వినిపించిందని, కొన్ని ఇండ్లు కంపించాయని స్థానికులు చెప్పారు.