అర్జున్, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. మే 28న సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అర్జున్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకెంతో స్పెషల్. అవుట్‌పుట్ చూసి చాలా సంతృప్తి చెందా.
ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా, మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి? వంటి అంశాలు ఇందులో ఉంటాయి. అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది ఎంతో కష్టపడ్డారు. మహిళా సాధికారతకు కమర్షియల్ అంశాలు జోడించి చేసిన గొప్ప చిత్రమిది’ అని అన్నారు.
ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేయడం కొత్తగా అనిపించిందని నటి అభిరామి చెప్పారు. అందరూ మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని ప్రీతి ముకుందన్ చెప్పింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు సుభాస్ అన్నాడు. అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య కల్పాత్తి పాల్గొన్నారు.
