ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ​కార్మికులు 17 రోజులుగా చేస్తున్న సమ్మెపై సింగరేణి, రాష్ట్ర సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని బీఎంఎస్​ లీడర్లు ఆరోపించారు. కాంట్రాక్ట్​ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని ఆదివారం హైదరాబాద్​లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషిని బీఎంఎస్​ ప్రతినిధులు కలిసి విన్నవించారు. స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్​జోషి ఫోన్​లో సీఎండీతో మాట్లాడి ఈనెల 26న రీజినల్ లేబర్​ కమిషనర్​ సమక్షంలో జరిగే చర్చల్లో సమస్య  పరిష్కారమయ్యేలా చొరవచూపాలని ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్​ నేషనల్ లీడర్​, బొగ్గు పరిశ్రమల ఇన్​చార్జి, జేబీసీసీఐ మెంబర్  కొత్తకాలపు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కోల్ మైన్స్​కాంట్రాక్ట్​ మజ్దూర్ సంఘ్​(బీఎంఎస్​) స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, జనరల్ సెక్రటరీ ఇనపనూరి నాగేశ్వరరావు, వర్కింగ్​ ప్రెసిడెంట్​ సీహెచ్​మహేశ్, ఏబీకేఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్​ మండ రమాకాంత్, పులిరాజిరెడ్డి, పెండం సత్యనారాయణ  తదితరులు  ఉన్నారు.

సింగరేణి లాభాలను తక్కువ చూపే కుట్ర 

మందమర్రి,వెలుగు: సింగరేణికి గతేడాది వచ్చిన లాభాలను తక్కువగా చూపే కుట్ర జరుగుతోందని ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్  వైస్​ ప్రెసిడెంట్  సిద్దంశెట్టి రాజమౌళి, జనరల్​సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య ఆరోపించారు. సంస్థకు రూ.2 వేల కోట్లకుపైగా లాభాలు వచ్చాయని, కార్మికులకు 35 శాతం తక్కువ కాకుండా వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్​చేశారు. ఆదివారం మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్​లో యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్​ దేవి భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సంస్థకు గడిచిన 2021-–22 ఆర్థిక సంవత్సరం మొదటి  ఆరు నెలల్లో  రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని సింగరేణి  సీఎండీ, డైరెక్టర్లు అధికారికంగా ప్రకటించిన విషయం గుర్తుచేశారు. ఏడాది ముగిసిన తర్వాత లాభాల మొత్తం రూ.2 వేల కోట్లు దాటి ఉండొచ్చన్నారు. కొన్ని కార్మిక సంఘాలు రూ. 1,227 కోట్ల లాభాలు వచ్చాయంటూ  తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఇది కార్మిక వర్గానికి తీరని అన్యాయమన్నారు. సమావేశంలో ఐఎన్టీయూసీ ఏరియా వైస్​ ప్రెసిడెంట్​దేవీ భీమయ్య, రామకృష్ణాపూర్​ వైస్​ ప్రెసిడెంట్ తేజావత్​ రాంబాబు, ఏరియా వైస్​ ప్రెసిడెంట్లు దొరిశెట్టి చంద్రశేఖర్, యాదగిరి, జాయింట్​సెక్రటరీ కారుకూరి తిరుపతి, కనమంద స్వామి, ఆర్కే1ఏ పిట్​సెక్రటరీ బూస రాజేశ్, లీడర్లు పరమేశ్, దేవ రమేశ్​, నక్క హరీశ్, సంతోష్​, సురేశ్, చిరంజీవి, అనిల్​కుమార్​, బండి శ్రీనివాస్, బి.శంకర్ పాల్గొన్నారు. 

అభయ హస్తం పింఛన్​ డబ్బులు ఇవ్వండి

లోకేశ్వరం, వెలుగు : అభయ హస్తం పింఛన్​ డబ్బులు ఇవ్వాలని  లోకేశ్వరం మహిళలు ఆదివారం ఎమ్మెల్యే విఠల్​రెడ్డిని నిలదీశారు. బతుకమ్మ చీరల పంపిణీకి వచ్చిన ఆయను డ్వాక్రా సంఘాల మహిళలు చుట్టుముట్టారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.

బెల్టు షాపుల టెండర్లు వద్దని ఆందోళన

లోకేశ్వరం,వెలుగు: గ్రామంలో బెల్టు షాపు టెండర్లు ఆపి గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామంలో మద్యం బెల్ట్ షాప్ వేలంపాట నిర్వహణ కోసం ఆదివారం గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకోగా అదే గ్రామానికి చెందిన ఆలూరి ప్రవీణ్ రెడ్డి  గ్రామంలో ని ఎస్సారెస్పీ తదితర భూముల సమస్యలు పరిష్కరించాలని ఆ తర్వాతే బెల్ట్ షాప్ కోసం వేలంపాట నిర్వహించాలని కోరాడు. గ్రామస్తులు అదేమి పట్టించుకోకపోవడంతో స్థానిక వాటర్​ట్యాంక్​ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. లేదంటే కిందకి దూకుతానని హెచ్చరించాడు. అయినా పట్టించుకోకుండా టెండర్​పూర్తిచేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఆదివాసీలు, బీజేపీ కార్యకర్తలను ఆదుకుంటాం

తిర్యాణి, వెలుగు: ఆదివాసీలు, కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ చెప్పారు. ఆదివారం స్థానికంగా నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనానికి  చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఏజెన్సీ గ్రామాలకు అధికార పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు. అనంతరం పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ సార రమేశ్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షుడు వెడ్మ భగవంతరావు, ప్రధాన కార్యదర్శి పులి వెంకటేశ్,ఉపాధ్యక్షుడు గేడం సుభాష్​, లీడర్లు వల్కా శ్రీధర్, సీతారాం, ధర్ము తదితరులు పాల్గొన్నారు.

వైద్యరంగంలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకం 

మంచిర్యాల, వెలుగు: వైద్యరంగంలో ఫార్మాసిస్టుల పాత్ర ఎంతో కీలకమని డీఎంహెచ్​వో సుబ్బరాయుడు అన్నారు. ఆదివారం వరల్డ్​ ఫార్మసిస్టు డే సందర్భంగా లయన్స్​ క్లబ్ భవన్​లో ఫార్మసిస్టులను సత్కరించారు అసోసియేషన్ అధ్యక్షుడు అఖిల్, ప్రధాన కార్యదర్శి ఎంఏ.బారీ, జీజీహెచ్​ ఫార్మసిస్టు సూపర్​వైజర్ శ్రీవాణి, కాళేశ్వరం జోన్ ఫార్మసిస్టు అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పి.శంకర్, ప్రతినిధులు నాగేందర్, శ్రీనివాస్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

హోరాహోరీగా బాస్కెట్​ బాల్​ పోటీలు 

మంచిర్యాల,వెలుగు:మంచిర్యాలతో పాటు లక్సెట్టిపేటలో క్రీడా సంరంభం ప్రారంభమైంది. మంచిర్యాలలోని జడ్పీ బాయ్స్​ హైస్కూల్​ గ్రౌండ్​లో తెలంగాణ స్టేట్​ జూనియర్​ ఇంటర్​ డిస్ర్టిక్ట్​ 6వ బాస్కెట్​ బాల్​ చాంపియన్​ షిప్​ను ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, కలెక్టర్​ భారతి హోళికేరి, మున్సిపల్​ వైస్​ చైర్మన్​, బాస్కెట్​ బాల్​ అసోసియేషన్​జిల్లా  చైర్మన్​ గాజుల ముఖేష్​గౌడ్​ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్​ జిల్లా ప్రెసిడెంట్​ ఉదారి చంద్రమోహన్​గౌడ్​, సెక్రటరీ సుకుమార్​ ఫ్రాన్సిస్​, ప్రతినిధులు పాల్గొన్నారు.  

లక్సెట్టిపేటలో గురుకుల జోనల్​ గేమ్స్​... 

దండేపల్లి, వెలుగు: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కాళేశ్వరం జోనల్ గేమ్స్​లక్సెట్టిపేటలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, కలెక్టర్​ భారతి హోళికేరి సంక్షేమ గురుకులాల స్టేట్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రాంలక్ష్మణ్ క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ నల్మాస్​ కాంతయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, ఆర్సీవో సువర్ణలత, ఏఆర్సీవో కోటిచింతల మహేశ్వరరావు, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్స్ రామల బాలభాస్కర్, పోలోజు బాల రాజు, రీజినల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్స్ సట్ల శంకర్, ఎన్​.మల్లిక, ఆదిలాబాద్ రీజియన్ లోని సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.  

చర్చల్లో సానుకూలత లేకపోతే సమ్మె ఉధృతం

మందమర్రి/నస్పూర్,వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్​కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 17 రోజులుగా సమ్మె చేస్తున్నా.. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇప్టూ నేషనల్ లీడర్​ టి.శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం శ్రీరాంపూర్​ఏరియా వారాంతపు సంత గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్​ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం జరిగే చర్చల్లో వేతనాల పెంపుదలపై నిర్ణయం తీసుకోపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ లీడర్లు డి. బ్రహ్మానందం, గట్టు మహేందర్, దొడ్డిపట్ల రవీందర్, మేకల రామన్న, నర్సయ్య, ప్రభాకర్, గొట్టె శ్రీనివాస్, అశోక్​పాల్గొన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కోసం కాంట్రాక్ట్​ కార్మికుల శాంతియుంతంగా సమ్మెను చేస్తుంటే పోలీసులు జేఏసీ లీడర్లపై అక్రమ కేసులు బనాయించారని టీఎన్టీయూసీ స్టేట్​ సెక్రటరీ బి.సంజయ్​కుమార్, సీపీఎం డిస్ట్రిక్ట్​సెక్రటరీ సంకె రవి ఆరోపించారు. 

శరన్నవరాత్రులకు బాసర ముస్తాబు

బాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం దేవీ శరన్నవరాత్రులకు ముస్తాబైంది. సోమవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు వేడుకలు జరుగనున్నాయి. వేకువ జామున 4 గంటలకు మంగళవాయిద్యసేవ, గణపతి పూజలతో ఉత్సవాలు ప్రారంభించనున్నారు. 4.30 గంటలకు సరస్వతి, లక్ష్మీ మహాకాళి అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణ, మంగళ హారతి, మంత్రపుష్పంతో పూజలు చేయనున్నారు. ఆలయ అధికారులు ఆలయాన్ని పూలు, రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సోమయ్య తెలిపారు. 

తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాలు..

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తారు. 27 మంగళవారం బ్రహ్మాచారిణి, 28 బుధవారం చంద్రఘంట, 29 గురువారం కూష్మాండ, 30 శుక్రవారం స్కందమాత, వచ్చేనెల ఒకటి శనివారం కాత్యాయని, 2న కాళరాత్రి, 3న మహాగౌరి, 4న సిద్ధిదాత్రిగా దర్శనిమివ్వనున్నారు.

ఆర్టీసీని ఆదరించాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: బడి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఆదిలాబాద్ డిపో లాభాల బాట పడుతుందని డిపో  మేనేజర్ కల్పన చెప్పారు. సొంత జిల్లాలో డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమెను ఆదివారం టీచర్లు సన్మానించారు. 30 మంది ప్రయాణికులు ఉంటే ఆ ఏరియాకు బస్సును పంపిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు ఉన్నతాధికారుల అనుమతితో సంప్రదిస్తే పది శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు కిరణ్ బాల సన్మాన కార్యక్రమానికి రావడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలెంధర్​రెడ్డి, హెచ్ఎం నరేందర్​రెడ్డి, అసిస్టెంట్​మేనేజర్​జనాబాయి, స్టేషన్ మేనేజర్ జేఎన్ కుమారి, స్టేషన్ కంట్రోలర్ చందర్, తన్వీర్, డీసీ వందన, టీచర్లు యాళ్ల లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.