
ఢాకా: భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్‌హసీనాను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) డిమాండ్ చేసింది. ఆమెను చట్టబద్ధంగా అప్పగించాలని భారత్‌ను కోరింది. ఆమెకు ఆశ్రయం కల్పించడం విచారకరమని పేర్కొన్నది. భారత్ నుంచి ఆమె బంగ్లాదేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించింది. పలు అభియోగాల్లో హసీనాను విచారించేందుకు తమ దేశ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంఘీర్ పేర్కొన్నారు.
మాజీ ప్రధానిపై మరో కేసు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బుధవారం మరో హత్య కేసు నమోదైంది. రిజర్వేషన్లకు నిరసనగా ఆగస్టు 4న సిల్హెట్ నగరంలో నిర్వహించిన ర్యాలీపై దాడి జరిపి పలువురి మృతికి కారణమయ్యారంటూ జాతీయతవాది ఛత్ర దళ్ (జేసీడీ) సిల్హెట్ సిటీ యూనిట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ జుబెర్ అహ్మద్.. సిల్హెట్ మెట్రోపాలిటన్ కోర్టులో కేసు వేశారు. హసీనా సోదరి షేక్రెహానా కూడా ఇందులో నిందితురాలిగా ఉన్నారు.
అలాగే, అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ, రవాణాశాఖ మాజీ మంత్రి ఒబైదుల్క్వాదర్, హోంశాఖ మాజీ మంత్రి అసదుజ్జమాన్ఖాన్, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమ్మద్, న్యాయ శాఖ మాజీ మంత్రి అనిసుర్ రెహమాన్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు సల్మాన్ ఎఫ్ రెహమాన్ తోపాటు మొత్తం 86 మందిని ఈ కేసులో చేర్చారు. దీంతో దేశం విడిచినప్పటినుంచీ ఇప్పటివరకూ హసీనాపై మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 మర్డర్ కేసులున్నాయి. మారణహోమానికి కారకులయ్యారనే ఆరోపణలపై 4 కేసులు.. కిడ్నాప్‌నకు సంబంధించి మరో కేసు నమోదైంది.