డైవర్షన్ పాలిటిక్స్ ఎంత కాలం ? పెట్టుబడులను అడ్డుకోవడమే ఉద్దేశమా !

డైవర్షన్ పాలిటిక్స్ ఎంత కాలం ? పెట్టుబడులను అడ్డుకోవడమే ఉద్దేశమా !

కాళేశ్వరం, విద్యుత్ పదేండ్ల దోపిడీపై ఇప్పటికే ప్రజల చర్చల్లో ఉంది. దాన్ని డైవర్ట్​ చేయడమే లక్ష్యంగా మీడియాలను, సోషల్ మీడియాలను నిర్వహిస్తూ వాటితో  ప్రజాప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక దుష్రచారానికి ఒడిగట్టడం కనిపిస్తున్నదే. ప్రజా నేతగా రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి ఏంటో చూసి..  కనీస ఆధారాలు లేకుండా ఫ్రస్ట్రేషన్కు లోనై.. ఇక ఏం చేసినా తమను  ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే సంపూర్ణ సత్యం తెలిసిన బీఆర్ఎస్ ముఖ్య నేతలిద్దరూ నిందించడమే పనిగా పెట్టుకున్నారేమో !

కానీ, సకారాత్మక రాజకీయంతో అధికారం సాధించుకోవడం వేరు.   కేటీఆర్, హరీష్ రావు ద్వయం ఇంకా ప్రజల్లో  ఏదో అశాంతిని, రాష్ట్రంలో అస్థిరతను అపోహలు సృష్టించి ప్రభుత్వానికి  అపవాదు అంటగట్టాలను కోవడం వేరు! అయినా ప్రజలు వారిని పట్టించుకుంటున్న జాడ ఉందా? మొన్న జరిగిన కంటోన్మెంట్,  నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో  ప్రజలు ఎలాంటి తీర్పులిచ్చారో చూశాం! ప్రజా ప్రభుత్వం  ఏ పని చేసినా  దానిపై ఏదో రకంగా తమ అక్కసు వెళ్లగక్కుతూ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్నారు.

కబ్జాకోరులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దు, కోటిన్నర మంది నివాసం ఉంటున్న హైదరాబాద్లోని చెరువులు, జలావాసాల  కబ్జాదారుల చెరల్ని విడిపించాలని, విశ్వ నగరంగా మన నగరం విలసిల్లితేనే 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమనే సంకల్పంతో  హైడ్రాను తెచ్చింది ప్రజాప్రభుత్వం. దీన్ని యావత్  సమాజం హర్షామోదంతో  స్వాగతించింది.   అబద్ధ   ప్రచారాలతో  బీఆర్ఎస్  చేసిన రాజకీయ అల్లరిని ప్రతి హైదరాబాదీ తిరస్కరించాడు. ఆ తర్వాత మూసీ  పునరుద్ధరణ, భూభారతి,  ఫోర్త్ సిటీ ఇలా ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా వ్యతిరేకించడం, బురద జల్లడమే ఏకైక ఎజెండాగా ప్రతిపక్షం వ్యవహరించడం మన దురదృష్టమని ప్రజలు ఆలోచిస్తున్నారు.

ఫ్రస్ట్రేషన్ ఆరోపణలు
తొలినాళ్లలో  సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాలైన బాలానగర్,  జీడిమెట్ల,  సనత్​నగర్,  అజమాబాద్  వంటి ప్రాంతాల్లో నాటి కాంగ్రెస్  ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమల్ని ఏర్పాటు చేసింది.  రానురాను సిటీ  విస్తరించడంతో ఇవి నడి మధ్యకు  చేరుకున్నాయి.  దీంతో ఈ కాలుష్య కారక పరిశ్రమలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని వాటిని సిటీకి బయటకు పంపే కార్యక్రమాలు చాలారోజులుగా నడుస్తున్నాయి. ఈ ప్రాసెస్  ప్రభుత్వాలుగా ఎవరున్నా చేయాల్సినవే.  అయితే అవే స్థలాల్ని నగరాభివృద్దికి వినియోగించుకునేందుకు వీలుగా నివాస, వాణిజ్య, ఇతర స్థలాలుగా మార్చే ప్రక్రియలను చేస్తారు. అందులో భాగంగా గత బీఆర్ఎస్ హయాంలోనూ జరిగాయి.

అయితే నేడు తొమ్మిదిన్నరేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్ ఆ పరిశ్రమల జాగాల్లో  9,292 ఎకరాలు భూమిలో  ఏదో జరుగుతుందని  చెపుతూ 5 లక్షల కోట్ల కుంభకోణం అనే మరో గోబెల్స్ ప్రచారానికి తెరతీశారు. ఇది కూడా దురుద్దేశపూరితమే అని ఎవరికైనా అర్థమవుతుంది.  ఆ 9,292 ఎకరాల్లో రోడ్లు,  మౌలికవసతులు,  డ్రైనేజీలు, పార్కులు ఇలా అవసరాలకుపోను 4,740 ఎకరాలే  ప్లాటింగ్ చేసి పరిశ్రమలకు  కేటాయించింది అని తెలియనట్టు మాట్లాడటం పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతున్న చందంగా ఉందని విశ్లేషకులకు సైతం అర్థమవుతున్న విషయం.

బీఆర్ఎస్​ హయాంలోనే జీవోలు
అజమాబాద్, కూకట్​పల్లి, హఫీజ్​పేట్ పారిశ్రామిక భూముల్ని క్రమబద్ధీకరించింది బీఆర్ఎస్ సర్కారే.  సరిగ్గా ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు లీజుదారులకు,  ప్రీహోల్డ్ దారులకు తేడాలు చెప్పకుండా,  ప్రీహోల్డ్ రైట్స్ పేరిట  కేటీఆరే మంత్రిగా ఉన్న ఇండస్ట్రీస్, కామర్స్  డిపార్ట్​మెంట్​లో  2023 జీవో నెం. 19, 20, 21ల పేరుతో  మూడు జీవోల్ని జారీచేసిన విషయం మర్చిపోయారేమో!  అయితే,  ప్రస్తుత  హైదరాబాద్  ఇండస్ట్రియల్ లాండ్స్  ట్రాన్స్ పర్మేషన్  పాలసీలో   ఆ భూములు కన్వర్షన్ చేసి ఉపయోగంలోకి తీసుకువచ్చి తద్వారా  ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే  సదుద్దేశమే  ప్రభుత్వ ప్రయత్నాల్లో  కనిపిస్తుంది.

ఇందులో కూడా గత బీఆర్ఎస్ హయాంలో దొడ్డిదారిన చేజిక్కించుకున్నవారికి, ఆ భూములపై పరిశ్రమల స్థాపనలో యాజమాన్య హక్కులు లేనివారికి ఈ పాలసీ ప్రకారం కన్వర్షన్ చేసుకునే అవకాశం కూడా ఉండదని ప్రభుత్వం చెపుతున్నది.  అంటే నాడు ఎవరైతే పరిశ్రమల కోసం భూమి తీసుకొని, ఉద్యోగాల ద్వారా సమాజానికి ఉపయోగపడ్డారో ఇప్పుడు ఆ కాలుష్య పరిశ్రమల్ని నగరానికి దూరంగా పంపించడం ద్వారా ఖాళీగా ఉన్న ఆ స్థలాల్ని సమాజానికి అనువుగా ఉపయోగించుకొనే కన్వర్షన్ ప్రక్రియను మాత్రమే ప్రభుత్వం చేస్తుంది.  ఇది కూడా ప్రజలు ఏకపక్షంగా తమ ఓట్ల ద్వారా ఇస్తున్న తీర్పును సహించలేక చేస్తున్న ఆరోపణలే!

కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి
ప్రజాసమస్యలను లేవనెత్తి, ప్రభుత్వం దృష్టికి తెచ్చి  ప్రజాజీవితాలకు మేలుచేసే చర్యలే  ప్రతిపక్షాలు  చేయాల్సి ఉంటుంది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్​కు అనుమతి వచ్చినవేళ దాన్ని మరోసారి లొట్టపీసు కేసంటూ,  ఏం లేదనే ఆయన పరిభాషలోనే  భయం కనిపించడంలేదా ? ప్రత్యక్షంగా ఆధారాలతో  సహా  ఆ  రూ. 52 కోట్లు  ప్రభుత్వ అనుమతి లేకుండా కట్టబెట్టిన వైనం కనబడుతున్నదే ! ఇలా తమ తప్పుల నుంచి  ప్రజల దృష్టిని మళ్లించేందుకే సెన్సేషనల్ ఆరోపణలు చేస్తున్నారని అనిపించడం సహజం.

పెట్టుబడులను అడ్డుకోవడమే ఉద్దేశమా!
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని  సృష్టించడానికి ఏకంగా ప్రెస్ మీట్లలోనే  పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని కేటీఆర్ బెదిరిస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఇలా వారు అడ్డుకుంటోంది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, అంతిమంగా ప్రజలనే కదా! తెలంగాణ ఏమైనా పర్వాలేదు, ఇక్కడి ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదు. తమ స్వార్థ ప్రయోజనాల్ని నెరవేర్చుకోవాలి అనే బీఆర్ఎస్ ​పెద్దల ఎత్తుగడల్ని పసిగట్టలేని స్థితిలో నేటి తెలంగాణ సమాజం లేదనే సత్యాన్ని వారు అర్థం చేసుకోవాలి.

బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీఈవో, టిసాట్ నెట్​వర్క్