కేసీఆర్కు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనే హక్కులేదు

కేసీఆర్కు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనే హక్కులేదు

నీళ్లు, నిధులు, నియామకాల కోసం 4 కోట్ల ప్రజలు బరిగీసి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించి 8 ఏళ్లైనా ఆకాంక్షలు నెరవేరలేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఫైర్ సీఎం కేసీఆర్ పై ఫైర్​​అయ్యారు. వలస బతుకులుండవని, నీళ్లు, నిధులు, నియామకాలు మనకే ఉంటాయని కేసీఆర్ గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్పై బొడిగె శోభ మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రజలకు  చేసింది శూన్యమని అన్నారు. ఎకరానికైనా నీళ్లిచ్చావా? నీ కుటుంబానికి తప్ప ఎవరికైనా ఉద్యోగాలు దొరికాయా? అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఆనాడు బలిదానాలు చేసినా.. నేడు ఉద్యోగాలు రాక యువత మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, మూడెకరాల భూమి, రైతు రుణమాఫి, నిరుద్యోగ భృతి, 57 ఏళ్లు నిండిన వారికి ఫించన్లు ఏమయ్యాయి? శోభ ప్రశ్నించారు. 

వ్యాపారస్థులను రాజ్యసభకు పంపి అమరుల కుటుంబాలకు పదవులు ఎందుకు ఇవ్వలేదని శోభ నిలదీశారు. బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్రం కోసం బలైన శ్రీకాంతచారి తల్లి ఓడిపోతే ఆమెకు ఎందుకు రాజ్యసభ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు తెలంగాణ వద్దొన్నోళ్లను, ఉద్యమకారులను కొట్టించినోళ్లు... కేసీఆర్ కేబినెట్ లో ఉండి రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు. చనిపోయిన అమరవీరులందరి పేరిట స్థూపాలు కట్టి.. వాళ్ల తల్లిదండ్రుల కాళ్లు కేసీఆర్ మొక్కాలని శోభ డిమాండ్​ చేశారు. అప్పటి వరకు కేసీఆర్ కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనే హక్కులేదని అన్నారు. కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ సపోర్టు చేస్తే తెలంగాణ వచ్చిందే తప్ప.. బిల్లు పెట్టిన నాడు కేసీఆరే ఓటే వేయలేదని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, అమరవీరుల స్థూపాల నిర్మాణాలు ఎక్కడ? అని ప్రశ్నించారు. 

తెలంగాణ ద్రోహులను పక్కనబెట్టుకుని అవతరణ దినోత్సవాలు జరుపుతుంటే బాధ కలుగుతోందని బొడిగె శోభ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో కనిపించని ఎర్రబెల్లి, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ లాంటి వాళ్లను పక్కన పెట్టుకోవడాన్ని తప్పుబట్టారు. 2023లో తెలంగాణ ప్రజలంతా ఏకమై రాజకీయంగా కేసీఆర్ ను పాతరేస్తారని స్పష్టం చేశారు. 2023లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని శోభ ధీమా వ్యక్తం చేశారు.