ఐదేళ్ల క్రితం యాంకర్ మిస్సింగ్‌.. అస్థిపంజరం దొరికింది

ఐదేళ్ల క్రితం యాంకర్ మిస్సింగ్‌.. అస్థిపంజరం దొరికింది

గత ఐదేళ్లుగా కనిపించకుండా పోయిన న్యూస్ యాంకర్ సల్మా సుల్తానా లష్కర్ హత్య కేసులో అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ కోర్బా పోలీసులు వెల్లడించారు.  అయితే ఆ అస్థిపంజరం మిస్సయిన న్యూస్ యాంకర్ ది అని ఇంకా నిర్ధారణ కాలేదు. అస్థిపంజరంతో పాటు ఒక జత చెప్పులు కూడా లభించాయి. అస్థిపంజరం నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, సల్మా సుల్తానా లష్కర్ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన నమూనాలతో పోల్చి చూడనున్నారు.   2018లో మిస్సింగ్‌గా కనిపించకుండా పోయిన  న్యూస్ యాంకర్‌ను హత్య చేసినందుకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.   విచారణలో బాధితురాలిని ముగ్గురు వ్యక్తులు గొంతుకోసి హత్య చేసి పాతిపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.  

సల్మా సుల్తానా లష్కర్ ,ఆమె భర్త  మధు సాహు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.   కోర్బా నగరంలోని ఓ ఫ్లాట్‌లో కలిసి నివాసం ఉండేవారు . అయితే ఒకరిపై  మరొకరు అనుమానాలు, ఆర్థిక సమస్యలే వీరి మధ్య గొడవలకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.   2018 అక్టోబర్ 21న, సాహు, సల్మా మధ్య వాగ్వాదం జరిగింది, ఈ సమయంలో సాహు ఆమెను గొంతుకోసి చంపాడు. దీనికి అతని స్నేహితులు కూడా  సహకరించినట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురూ ఆమె మృతదేహాన్ని నగరంలోని ఏకాంత ప్రాంతంలో కొహడియా వంతెన సమీపంలో పాతిపెట్టారు. ఆ తర్వాత ఈ స్థలం జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టులో భాగమైంది.

దర్రీ ఎస్పీ రాబిన్సన్ గుడియా ఈ ఏడాది మేలో పెండింగ్ కేసులను సమీక్షించారు. అందులో భాగంగా సల్మా సుల్తానా కేసును తిరిగి  మళ్లీ  దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. అయితే విచారణలో ఐదేళ్ల క్రితం సల్మాను హత్య చేసి మృతదేహాన్ని కోర్బా-దర్రీ రోడ్డులో పాతిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని వెలికితీసేందుకు జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేసి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు.   2018లో తప్పిపోయినప్పుడు సల్మా సుల్తానా వయసు 25ఏళ్లు.