బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి

బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి

ముంబై: బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ (54) బుధవారం చనిపోయాడు. కొలొన్ (పెద్ద పేగు) ఇన్ఫెక్షన్ తో మంగళవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అం​బానీ ఆస్పత్రిలో ఇర్ఫాన్ ను చేర్చారు. న్యూరోఎండో క్రైన్ ట్యూమర్ తో బాధపడుతూ 2018లో ట్రీట్ మెంట్ కోసం ఇర్ఫాన్ యూకే వెళ్లాడు. గతేడాది ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన.. ఆగిపోయిన అంగ్రేజీ మీడియం అనే ఫిల్మ్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. అయితే అనారోగ్య కారణాలతో ఈ సినిమా ప్రమోషన్స్ కు మాత్రం రాలేకపోయాడు. దశాబ్దాల కెరీర్ లో ఇర్ఫాన్ పలు ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు సినీ ప్రేక్షకుల మనసులనూ గెల్చకున్నాడు. అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన సలాం బాంబే (1988), మక్బూల్ (2004), లైఫ్​ ఇన్ ఏ మెట్రో (2007), పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్ బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పీకూ (2015), తల్వార్ (2015), హిందీ మీడియం (2017) సినిమాల్లో తనదైన నటనతో ఇర్ఫాన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. సైనికుడు (2006) ఫిల్మ్ లో నటించి తెలుగు ఆడియన్స్ మెప్పునూ పొందాడు. స్లమ్ డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, లైఫ్ ఆఫ్​పై లాంటి ఇంటర్నేషనల్ చిత్రాల్లోనూ మెరిశాడు. 2011లో ఇండియా గవర్నమెంట్ నుంచి ఇర్ఫాన్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఇర్ఫాన్ భార్య పేరు సుతపా సిక్దర్. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు బాబిల్, ఆర్యన్. శనివారం ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం చనిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరు కాలేకపోయాడు.