బాలీవుడ్ ఫిదా: నిన్న నటుడు.. నేడు వాచ్ మన్

బాలీవుడ్ ఫిదా: నిన్న నటుడు.. నేడు వాచ్ మన్

బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించిన ఓ నటుడు.. ఇపుడు  ముంబైనగరం పరేల్ లో ఓ బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీగార్డ్ గా పనిచేస్తున్నాడు. అతడి పేరు సవీ సిద్దు. బ్లాక్ ఫ్రైడే, గులాల్, పటియాలా హౌజ్ లాంటి సినిమాల్లో నటించాడు. అవకాశాలు లేక… కుటుంబాన్ని పోషించే బాధ్యతతో… ఇలా వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో సవీ సిద్దు వాచ్ మన్ గా పనిచేస్తున్నాడంటూ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడికి సానుభూతితోపాటు… మద్దతు కూడా పెరుగుతోంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో సవీ సిద్దు చూపించాడంటూ మద్దతుగా నిలుస్తున్నారు బాలీవుడ్ సెలబ్రిటీలు.

డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరో రాజ్ కుమార్ రావు తాజాగా సవీసిద్దుకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఐతే… సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో… సవీ సిద్ధు తన కుటుంబాన్ని పోషించడానికి ఎంచుకున్న మార్గాన్ని మెచ్చుకుంటూ అతడికి గౌరవం ఇస్తున్నారు.

“సినిమా ఫీల్డ్ లో గొప్ప జీవితం అనుభవించిన వాళ్లు.. కొన్ని సందర్భాల్లో అంతా కోల్పోతారని.. అప్పుడు ధైర్యం లేని వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు.. మద్యానికి బానిస అవుతుంటారు… కానీ.. సవీ సిద్దు వాచ్ మన్ గా పనిచేయడానికి వెనుకాడలేదు. అతడు ఇపుడు చేస్తున్న జాబ్ చిన్నదేం కాదు. డిగ్నిటీ, హుందూతనంతో బతకడాన్ని సవీ ఎంచుకున్నాడు. నటుడు అన్న గర్వం అతనిలో లేదు. అందుకు అతన్ని చూసి మనం గర్వపడాలి. గొప్పపేరు తెచ్చుకున్న చాలామంది ప్రముఖులు… ఒకప్పుడు ఖాళీగా తిరిగినవారు, హోటల్ లో వెయిటర్ గా పనిచేసినవారు, భేల్ పూరీ అమ్మినవాళ్లు ఉన్నారు” అని అనురాగ్ కశ్యప్ చెప్పారు.

సవీసిద్ధు స్టోరీ చూస్తే ఎంతో స్ఫూర్తి కలుగుతోందని యాక్టర్ రాజ్ కుమార్ రావు అన్నారు. “సినిమాల్లో మీరు చేసిన పాత్రలు, మీ వర్కింగ్ నేచర్ , పాజిటివిటీని ప్రశంసిస్తున్నాం. నేను, నా సహచర నటులు మీకు అండగా ఉంటాం. పట్టుదల ఉంటే అవాంతరాలను అధిగమించగలం” అని రాజ్ కుమార్ రావు ట్వీట్ చేశారు.