
బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ మంచి మనసును చాటుకున్నారు. హైడ్రోసెఫాలస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు . ఈ చిన్నారి ఇంటికి వెళ్లి ముచ్చటించారు. ఆ చిన్నారికి ఆహారం తినిపించడం, ఆడుకోవడం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అండగా నిలిచి... తనలోని మానవీయ కోణాన్ని చాటుకుని అందరి హృదయాలను గెలుచుకున్నారు జాక్విలిన్.
చిన్నారితో జాక్విలిన్..
ప్రస్తుతం ఆ చిన్నారిని కలిసి జాక్విలిన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. చికిత్స కోసం అయ్యే అన్ని వైద్య ఖర్చులను వ్యక్తిగతంగా భరిస్తానని వారికి హామీ ఇచ్చారు. కాసేపు ఆ చిన్నారిని నవ్వించే ప్రయత్నం చేసింది. దగ్గరికి తీసుకుని ఆహారం తినిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జాక్విలిన్ ను ప్రశంసిస్తున్నారు. ఆమె పెద్ద మనసును మెచ్చుకుంటున్నారు.
హైడ్రోసెఫాలస్ అంటే?
హైడ్రోసెఫాలస్‌ను సాధారణంగా "మెదడులో నీరు" అని అంటారు. ఈ వ్యాధిలో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మెదడులోని వెంట్రికల్స్‌లో పేరుకుపోయి మెదడు కణజాలాలపై ప్రమాదకరమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స అందకపోతే తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తారు. సర్జరీ లేదా దీర్ఘకాలిక వైద్య సంరక్షణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ ఖర్చులను భరించలేక చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. జాక్వెలిన్ చేసిన ఈ సహాయం ఆ చిన్నారి కోలుకోవడానికి తోడ్పడుతుంది.
సమాజ సేవా కార్యక్రమాల్లో ముందు..
ఇది జాక్వెలిన్ చేసిన మొదటి చారిటబుల్ పని కాదు. గతంలో కూడా ఆమె అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఈసారి ఆమె వ్యక్తిగతంగా చిన్నారిని కలవడం, వారి సమస్యలను విని, సహాయం అందించడం చాలా మందిని ఆకట్టుకుంది. ఒక ప్రముఖ సెలబ్రిటీ నేరుగా బాధిత కుటుంబాన్ని కలవడం, వారి కష్టాలను అర్థం చేసుకోవడం, ఒక స్పష్టమైన పరిష్కారాన్ని అందించడం నిజంగా ప్రశంసనీయమని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వృత్తిపరంగా కూడా జాక్వెలిన్ చాలా బిజీగా ఉన్నారు. ఆమె త్వరలో విడుదల కానున్న యాక్షన్-కామెడీ చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్' లో నటిస్తున్నారు. ఈ చిత్రం 'వెల్‌కమ్' ఫ్రాంచైజీలో మూడో భాగం. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్ మరియు సునీల్ శెట్టి వంటి స్టార్స్ కూడా ఉన్నారు. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.