ఈడీ విచారణకు హాజరైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

ఈడీ విచారణకు హాజరైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

న్యూఢిల్లీ: శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరైంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈమె సాక్షిగా హాజరైనట్లు సమాచారం.  ఎన్నికల కమిషన్‌తో సంబంధం ఉన్న లంచం కేసుతోపాటు మనీ లాండరింగ్‌ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో సాక్షిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు సోమవారం  విచారించినట్లు తెలుస్తోంది. ఈనెల 24వ తేదీన ఈ కేసుకు సంబంధించి  చంద్రశేఖర్‌కు చెన్నైలో ఉన్న ఓ బంగ్లాను, 82.5 లక్షల నగదు, డజనుకు పైగా ఖరీదైన కార్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు అవినీతి, అక్రమాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు ఈడీ వెల్లడించింది. నిందితుడు చంద్రశేఖర్‌ని రోహిణి జైలులో ఉన్నారు. 
మరో వైపు డ్రగ్స్ దొరకడంతో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోహ్లి అరెస్టుకు కొన్ని గంటల ముందు అరెస్టయిన టీవీ నటుడు గౌరవ్ దీక్షిత్ ఇచ్చిన సమాచారం మేరకు అర్మాన్ కోహ్లి ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించగా కొంత మొత్తంలో డ్రగ్స్ పట్టుపడడంతో అర్మాన్ కోహ్లిని కూడా అరెస్టు చేయడం కలకలం రేపింది. అరెస్టు చేసిన అర్మాన్ కోహ్లి నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబీ చేసిన వినతికి కోర్టు స్పందించి సెప్టెంబర్ 1 వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది.