ఫ్లాపులకు కేరాఫ్గా బాలీవుడ్

ఫ్లాపులకు కేరాఫ్గా బాలీవుడ్

భారీ బడ్జెట్, గ్రాండ్ మేకింగ్. బాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు దేశవ్యాప్తంగా పండగ వాతావరణమే.  ఇండియన్ సినిమాలకి కింగ్ అయిన బాలీవుడ్ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క హిట్ లేక కొట్టమిట్టాడుతోంది. కుర్ర హీరోలైనా, స్టార్ హీరోల సినిమాలైనా.. ప్రస్తుతం బాలీవుడ్ అంటే ఫ్లాప్ లకు కేరాఫ్ గా మారిపోతోంది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది బాలీవుడ్ . భారత్ లో ఎక్కువ మంది చూసే సినిమాలు.. ఎక్కువగా మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ ఇదే. కానీ ఇప్పుడు బాలీవుడ్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస ఫ్లాప్ లు వీటికి తోడు బాయ్ కాట్ బాలీవుడ్ నినాదాలు అగ్రహీరోలకు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. అందుకు కారణం హీరోలతో పాటు డైరెక్టర్ లు సినీపండితులు అంటున్నారు . స్టార్ హీరోలంతా కథని పట్టించుకోకుండా... ఏది తీసినా ఆడియెన్స్ చూస్తారులే అన్న ధోరిణి కొంప ముంచుతోందని అంటున్నారు. ఎలివేషన్ ను పక్కనపెట్టి... ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే స్టోరీలపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. 

ఇక నార్త్ తో ఏ మాత్రం సంబంధం లేని పుష్ప, ఆర్.ఆర్.ఆర్., కేజీఎఫ్, కార్తికేయ-2 తదతర సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసి కాలర్ ఎగరేస్తుంటే... బాలీవుడ్ సూపర్ స్టార్ లైన ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో బాలీవుడ్ లో పెద్దగా మార్కెట్ లేని సుదీప్ కు గ్రాండ్ వెల్కం లభిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన సుదీప్ సినిమా విక్రాంత్ రోనా భారీ హిట్ కొట్టి మంచి వసూళ్లు రాబట్టింది.  అయితే బాలీవుడ్ లో ఈ ఏడాది ఏ పెద్ద హీరో సినిమా హిట్ అవ్వలేదు. కోటి ఆశలతో గ్రాండ్ గా రిలీజ్ చేసిన అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా అట్టర్ ఫ్లాపైంది. ఫారెస్ట్ గంప్ కు రిమేక్ గా రిలీజ్ అయిన లాల్ సింగ్ చద్దా... ఫస్ట్ డే రూ.12 కోట్లు కలెక్ట్ చేస్తే... రెండో రోజు అందులో సగానికి సగం కూడా రాబట్టుకోలేకపోయింది. 180 కోట్లు పెట్టిన ఈ సినిమా మొత్తంగా 50 కోట్లు కూడా వసూల్ చేయలేకపోయింది.

మరో స్టార్ హీరో, హిట్ మ్యాన్ గా పేరున్న అక్షయ్ కుమార్ కు సైతం ప్లాప్ ల తిప్పలు తప్పట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్తూనే ఉన్నాడు. పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీని దేశవ్యాప్తంగా 5వేల స్క్రీన్స్ పై రిలీజ్ చేశారు. యష్ రాజ్ బ్యానర్ పై జూన్ 3న రిలీజైన ఈ సినిమాలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, సంజయ్ దత్, సోను సూద్ తదతర స్టార్లు నటించారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 62.3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. సాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వంలో రూ.165 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బచ్చన్ పాండే. ఇంత ఖర్చుచేసిన తీసిని ఈ సినిమా 50 కోట్లు కూడా రాబట్టలేదు. ఇక ఎన్నో ఆశలతో రాఖీ పండగ సందర్భంగా రిలీజ్ చేసిన అన్నాచెల్లెళ్ల ఎమోషనల్ మూవీ రక్షాబంధన్ కూడా చతికిలపడింది. ఫస్ట్ డే రూ.8 కోట్లు, రెండో రోజు రూ.6  కోట్లు, మూడో రోజు రూ.7  కోట్లు మొత్తంగా కలిపితే కనీసం రూ.25 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. 

అజయ్ దేవ్ గన్ కీ రోల్ చేసిన రన్ వే-34 కూడా ఫ్లాప్ అయింది. ఇందులో బిగ్ బి అమితాజ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ లు నటించారు. వివేక్ రంజన్ అగ్రిహోత్రి దర్శకత్వంలో హోమోసెక్సువాలిటీ మీద వచ్చిన బదాయ్ దూ మూవీని రూ.45 కోట్లతో నిర్మిస్తే... 20 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా జుండ్. నాగరాజ్ ముజిలే దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రూ.30 కోట్లు ఖర్చు చేస్తే... రూ.13 కోట్లు కూడా వసూలు చేయలేకపోవడంతో అమితాబ్ తన రెమ్యునేషన్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.

టైగర్ ష్రాఫ్ నటించిన హీరో పంథి 2 మూవీది ఇదే పరిస్థితి. రూ.85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... రూ.24 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక లక్షరాజ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన జాన్ అబ్రహం ఎటాక్ మూవీ ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో హిట్ కొట్టిన జెర్సీ మూవీని షాహిద్ కపూర్ తో బాలీవుడ్ లో రీమేక్ చేయగా ప్రేక్షకులు తిరస్కరించారు. దాదాపు రూ.100 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా కేవలం రూ.18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. దీపిక పదుకునే, సిద్దార్థ్, అనన్య పాండే లీడ్ రోల్ లో నటించిన సినిమా గెహ్రాయియా. శకున్ బట్రా దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాకి 17 కోట్లు ఖర్చు చేస్తే... రూ. 10 లక్షలు కూడా రాబట్టలేకపోయింది. సౌత్ లో స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల సినిమాలు సైతం కలెక్షన్స్ సునామీలు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. స్టార్ ఇమేజ్ కూడా వర్కౌట్ కాకపోవడం, రోజురోజుకి కలెక్షన్స్ పడిపోవడంతో బాలీవుడ్ మరింత కలవరపడుతోంది.