
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటే మాస్ ఆడియన్స్ కు పూనకాలు వస్తాయి. కానీ, ఆయనలో మరో కోణం కూడా ఉంది. సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా, పండగలు, సాంప్రదాయాలను గౌరవిస్తారు. ముస్లిం అయినప్పటికీ, హిందూ పండగలను కూడా అంతే భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణేశుడిపై సల్మాన్ కు ఉన్న భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం తన కుటుంబంతో కలిసి వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈసారి కేవలం ఇంట్లోనే కాదు, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ నివాసానికి వెళ్లి గణపతి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
సల్మాన్ ఖాన్ మంత్రి నివాసానికి వెళ్లినప్పుడు చాలా సింపుల్ గా, ఒక చెక్ షర్ట్, డెనిమ్ ప్యాంట్ ధరించి కనిపించారు. గణపతి విగ్రహం ముందు చేతులు జోడించి ప్రార్థనలు చేసి, హారతి కూడా ఇచ్చారు. ఈ ఫొటోలను మంత్రి ఆశిష్ శెలార్ స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేయడంతో అవి వెంటనే వైరల్ అయ్యాయి.
अभिनेते सलमान खान यांनी आमच्या वांद्रे पश्चिम सार्वजनिक गणेशोत्सव मंडळाच्या गणरायाचे दर्शन घेतले.#GanpatiBappaMorya #Ganeshotsav #AshishShelar pic.twitter.com/LNRyE4qjNN
— Adv. Ashish Shelar - ॲड. आशिष शेलार (@ShelarAshish) September 1, 2025
అంతకుముందు, తమ ఇంట్లో జరిగిన గణపతి ఉత్సవాన్ని కూడా సల్మాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను తన సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో ఏర్పాటు చేశారు. సల్మాన్ తల్లి సల్మా ఖాన్, తండ్రి సలీం ఖాన్, సోదరులు అర్బాజ్ ఖాన్, అల్విరా ఖాన్, అల్లుడు ఆయుష్ శర్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సల్మాన్ కూడా నల్లటి షర్ట్, బేజ్ ప్యాంట్ ధరించి గణపతికి హారతి ఇచ్చారు. రితేష్ దేశ్ముఖ్, జెనీలియా డిసౌజా వంటి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.