నా బ్యాగ్ లో బాంబు ఉంది.. ప్యాసింజర్ హెచ్చరిక

నా బ్యాగ్ లో బాంబు ఉంది.. ప్యాసింజర్ హెచ్చరిక

వాషింగ్టన్ :  తన వద్ద బాంబు ఉందని పేర్కొంటూ  విమానాన్ని మరో విమానాశ్రయానికి మళ్లించాలంటూ సిబ్బందిని ఒక ప్రయాణికుడు  బెదిరించాడు. దీంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన సియాటెల్‌కు బయలుదేరిన అలస్కా ఎయిర్‌లైన్స్‌  విమానంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాండన్‌ ఎల్‌ స్కాట్‌ అనే 38 ఏళ్ల వ్యక్తి తన వద్ద బాంబు ఉందంటూ విమాన సిబ్బందిని బెదిరించాడు. తన డిమాండ్లను వివరిస్తూ సిబ్బందికి బెదిరింపు నోట్‌ను అందించాడు. 

‘విమానంలో బాంబు ఉంది. నేను తమాషా చేయడం లేదు. నా బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు, ఒక డిటోనేటర్‌ కూడా ఉంది. నేను చెప్పినట్లు చేయకపోతే విమానాన్ని పేల్చేస్తాను. నేను మెక్సికన్‌ డ్రగ్‌ కార్డెల్‌ నుంచి పారిపోతున్నాను. నన్ను చంపాడానికి సియాటెల్‌లో కొందరు పథకం వేశారు. మర్యాదగా విమానాన్ని మరో విమానాశ్రయానికి మళ్లించండి. మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఇది కచ్చితంగా పాటించండి. పైలట్‌ను అప్రమత్తం చేయండి. సమస్యను మీరే పరిష్కరించుకోండి. లేదంటే అందరం చనిపోతాం’’అని నోట్‌లో తెలిపాడు. ఈ సమాచారాన్ని సిబ్బంది కెప్టెన్‌కు అందించారు. వెంటనే అతడు అలస్కా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ను అప్రమత్తం చేశాడు. విమానాన్ని స్పోకేన్‌కు మళ్లించారు. సమాచారం అందుకున్న పోలీసులు విమానం ల్యాండ్‌ అయ్యే సమయానికి అక్కడికి చేరుకున్నారు. నిందితుడితో సహా విమానాన్ని తనిఖీ చేయగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యమవ్వలేదు.