
చెన్నై: తమిళ స్టార్ హీరో ధనుష్, వెటరన్ కథానాయకుడు, రాజకీయ నేత విజయ్‌కాంత్ ఇళ్లల్లో బాంబులు ఉన్నట్లు ఓ ఆకతాయి బెదిరించాడు. పోలీసు కంట్రోల్ రూమ్‌కు సదరు వ్యక్తి కాల్ చేసి అభిరామపురంలోని ధనుష్ ఇంటితోపాటు విరుగంబాక్కంలోని విజయ్‌కాంత్ హౌజ్‌లో బాంబులు పెట్టామని చెప్పాడు. దీంతో పోలీసు అధికారులు హుటాహుటిన ఇరు నటుల ఇళ్ల వద్దకు చేరుకొని గాలింపులు జరిపారు. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. దీంతో ఇది ఫేక్ కాల్‌గా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. బాంబులు ఉన్నాయని రెండు కాల్స్ చేసింది ఒకే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే సదరు వ్యక్తి పోలీసులకు దొరకలేదని సమాచారం. గతంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్యకు కూడా బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. ఆ కాల్స్‌ను ఓ మానసిక రోగి చేసినట్లుగా గుర్తించారు.