గుడ్ విల్ కింద రూ.2 కోట్లు ఇవ్వండి : వివాదంలో ఆస్కార్ అవార్డ్ డాక్యుమెంటరీ

గుడ్ విల్ కింద రూ.2 కోట్లు ఇవ్వండి : వివాదంలో ఆస్కార్ అవార్డ్ డాక్యుమెంటరీ

ఆస్కార్-విజేత డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన మావటి జంట బొమ్మన్, బెల్లీలు చిత్రనిర్మాత కార్తికి గోన్సాల్వేస్ కు రూ.2 కోట్ల లీగల్ నోటీసులు పంపించారు. ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో వారికి అన్ని విధాలా సాయం చేస్తామని కార్తికి మాటిచ్చారని, ఇప్పుడు వాటిని నెరవేర్చడం లేదని ఆ దంపతులు నోటీసుల్లో తెలిపారు. ఇల్లు, వాహనంతో పాటు బెల్లీ మనవరాలు చదువుకు కావాల్సిన సాయం చేస్తామని, సినిమాల్లో నటించినందుకు వచ్చే కలెక్షన్స్ నుంచి కొంత మొత్తాన్ని తమకు ఇస్తారని ఆమె వాగ్దానం చేసినట్టు చెప్పారు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని తెలుపుతూ.. తాజాగా నోటీసులు పంపారని సమాచారం.

అంతే కాదు ఆస్కార్ వచ్చిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంచి కూడా ఆమె పురస్కారాలు, ఆర్థిక ప్రయోజనాలు అందుకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై ఓ మీడియా సంస్థ వారిని సంప్రదించగా.. ఈ కేసు గురించి ఇకపై మాట్లాడవద్దని తనకు సలహా ఇచ్చారని, ఏమైనా సమాచారం కావాలంటే తమ న్యాయవాదులను సంప్రదించాలని కోరారు.

తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్ లో మావటిగా పనిచేస్తోన్న బెల్లీ, బొమ్మన్ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా కార్తికి గోన్సాల్వేస్ ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు. గునీత్ మోగ్న నిర్మించిన ఈ చిత్రం 42నిమిషాల నిడివితో రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ 2023లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు కూడా సొంతం చేసుకుంది. అనంతరం కార్తికి తమను పట్టించుకోవట్లేదని ఈ దంపతులు ఆరోపణలు చేశారు. కనీసం సన్మానసభల్లోనూ ఆస్కార్ ను పట్టుకోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత తాము ప్రశాంతత కోల్పోయామని, ఆమె ప్రస్తుతం తమ కాల్ కూడా ఎత్తడం లేదని చెప్పారు. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ సైతం స్పందించింది. కానీ వారు చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఈ క్రమంలోనే వీళ్లు కార్తికికి లీగల్ నోటీసులు పంపడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.