కాంగ్రెస్ , చైనా, న్యూస్ క్లిక్ ఒకే జాతికి చెందినవి.. ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి

కాంగ్రెస్ , చైనా, న్యూస్ క్లిక్ ఒకే జాతికి చెందినవి.. ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి

ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ పై వస్తోన్న వార్తలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపైనా ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ , చైనా, న్యూస్ క్లిక్ ఒకే జాతికి చెందినవని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నకిలీ ప్రేమ దుకాణాల్లో చైనా వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇది చైనా పట్ల ఆయనకున్న ప్రేమను వ్యక్తం చేస్తోందని, ఆ పార్టీ వ్యక్తులు కూడా భారత వ్యతిరేక అజెండాను నడుపుతున్నారని చెప్పారు. చైనా అజెండాను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఈ పోర్టల్ ను నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.

ది న్యూయార్క్ టైమ్స్ ఇటీవలే ఓ పరిశోధన చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చైనా తన వైఖరిని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది, తమకు వ్యతిరేకంగా వచ్చే విమర్శలను తిప్పికొట్టేందుకు గ్లోబల్ నెట్ వర్క్ ను ఎలా ఉపయోగిస్తుందనే విషయాలపై వివరణాత్మక అంశాలను బహిర్గతం చేసింది. ఈ నెట్ వర్క్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అమెరికా బిలియనీర్ టెక్ మాగ్నెట్ నెవిల్లే రాయ్ సింఘమ్ అని ఆరోపణలు చేసిన న్యూయార్క్ టైమ్స్.. చైనీస్ ప్రచార టూల్‌కిట్‌కు నిధులు సమకూరుస్తున్న వ్యక్తిగా చెప్పుకొచ్చింది.

మీడియా ప్లాట్‌ఫారమ్ న్యూస్‌క్లిక్ దాదాపు రూ. 38 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు ఈడీ రెండేళ్ల క్రితమే తేల్చింది. ఆ తర్వాత ఇప్పుడు మరో సారి ఈ అంశం చర్చకు రావడం, ఈ పరిశోధన బహిర్గతం కావడం ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారింది. నెవిల్లే రాయ్ సింఘం ద్వారా న్యూస్‌క్లిక్ .. భారతదేశంలో చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి నిధులు పొందిందని ఆరోపణలు చేసింది. ఈ రకమైన వార్తలపై ఇటీవల స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఇలాంటి న్యూస్ పోర్టల్స్ ఫెయిర్ న్యూస్ పేరుతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు.  

నెవిల్ రాయ్ సింఘం ఎవరు?

నెవిల్లే రాయ్ సింఘమ్ తండ్రి వామపక్ష విద్యావేత్త. సింఘమ్ చికాగోకు చెందిన సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ థాట్‌వర్క్స్‌ను స్థాపించిన లాగ్‌టైమ్ కార్యకర్త అని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అతను కన్సల్టెన్సీ సంస్థలో పని చేస్తున్నప్పుడు కూడా కార్పొరేట్ సంస్కృతిని సృష్టించడం గురించి మాట్లాడాడని న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. సింఘమ్ మాజీ డెమోక్రటిక్ రాజకీయ సలహాదారు, కోడ్ పింక్ సహ వ్యవస్థాపకుడు. అతను జోడీ ఎవాన్స్‌ను వివాహం చేసుకున్నారు.