మధ్య యుగం రోజుల్లోకి వెళుతున్నాం.. కేంద్రం కొత్త బిల్లులపై రాహుల్.. నల్లచొక్కా ధరించి నిరసన

మధ్య యుగం రోజుల్లోకి వెళుతున్నాం.. కేంద్రం కొత్త బిల్లులపై రాహుల్.. నల్లచొక్కా ధరించి నిరసన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని నెల రోజుల జైలులో ఉంటే వారిని పదవి నుంచి తొలగించే మూడు బిల్లులను అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల చొక్కా ధరించి లోక్ సభలో నిరసన తెలిపారు. అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని రాహుల్ ఖండించారు.

ఈ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలనే ఎన్డీయే తీరు చూస్తుంటే మన దేశాన్ని మళ్లీ మధ్య యుగ కాలంలోకి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తోందని రాహుల్ మండిపడ్డారు. ప్రధానమంత్రితో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన తర్వాత 30 రోజులు జైలులో ఉంటే వారిని తొలగించే మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లులను అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లులపై రాహుల్ స్పందిస్తూ.. మనం మధ్యయుగ కాలానికి తిరిగి వెళ్తున్నామని, ఆ కాలంలో రాజు తన ఇష్టానుసారం ఎవరినైనా పదవి నుంచి తప్పించగలడని చెప్పారు. అతనికి ఎవరి ముఖమైన నచ్చకపోతే, అతను వారిని అరెస్టు చేయమని EDని కోరగలడని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తిని 30 రోజుల్లోగా బహిష్కరించగలడని ఈ బిల్లులపై స్పందించిన క్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ నిప్పులు చెరిగారు. ఈ బిల్లుల కాపీలను చించి అమిత్ షాపైకి విపక్ష సభ్యులు విసిరేయడంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. పలుమార్లు సభ వాయిదా పడింది.

రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి, రాజ్యాంగాన్ని పరిరక్షించే వారికి మధ్య యుద్ధం జరుగుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లులను "క్రూరమైన" చట్టంగా చెప్పుకొచ్చాయి. సీఎం, మినిస్టర్స్ను ఏక పక్షంగా అరెస్ట్ చేసి.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను అస్థిరపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని విపక్షాలు మండిపడ్డాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీ జైలులో ఉన్నప్పటికీ పదవుల్లో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే.. ఇలా కొనసాగడం సబబు కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. ప్రతిపక్ష పార్టీలను అస్థిరపరిచి అక్కడి ప్రభుత్వాలను పడగొట్టే దురుద్దేశంతో అధికార ఎన్డీయే కూటమి ఈ బిల్లులను ప్రవేశపెట్టిందనేది విపక్ష పార్టీల వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్త చర్చ జరుగుతోంది.