కాలుష్యం దెబ్బకు  ఎముకలు గుల్ల!

కాలుష్యం దెబ్బకు  ఎముకలు గుల్ల!

వాషింగ్టన్: వాయుకాలుష్యంతో మహిళల ఎము కలు నాలుగు పదుల వయసులోనే గుల్లబారుతున్నాయి. ప్రధానంగా ‘పోస్ట్​ మెనోపాజ్’​  దశలో  ఉన్నవారు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. గాలిలో నైట్రస్​ ఆక్సైడ్, నైట్రిక్​ ఆక్సైడ్​, సల్ఫర్ డయాక్సైడ్​​ అనే కాలుష్య కారకాలు పెరిగిపోయాయని.. వీటివల్లే మహిళలకు ఆస్టియోపోరోసిస్​  వచ్చి  వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయని  అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ సైంటిస్టుల స్టడీలో తేలింది. క్యాల్షియం సహా ఇతరత్రా మినరల్స్​ తగ్గడంతో ఎముకల సాంద్రత తగ్గిపోతోందని గుర్తించారు.

పోస్ట్​ మెనోపాజ్​ దశలో ఉన్న 1,61,808 మంది మహిళల ఆరోగ్యంపై జరిపిన స్టడీలో ఈవివరాలు వెల్లడయ్యాయని స్టడీ రిపోర్ట్​లో చెప్పారు. అమెరికాలో ఆస్టియోపోరోసిస్​తో బాధపడుతున్న వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పోస్ట్​ మెనోపాజ్ దశలో శరీరంలోని ఈస్ట్రోజెన్​ హార్మోన్​ మోతాదు తగ్గిపోతోందని, దీనివల్ల ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్టియో పోరోసిస్​ రిస్క్​ను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈవివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్​ ‘ఈ–క్లినికల్​ మెడిసిన్’ జర్నల్​లో పబ్లిష్​ అయింది. .

మెనోపాజ్ అంటే మహిళల్లో పీరియడ్స్​ ఆగిపోయే దశ. సహజంగా 50 నుంచి 55 ఏళ్లలోపు మహిళల్లో ఈ దశ ప్రారంభమవుతుంది. వయసుకు సంబంధించిన కారణాలతో పాటు హార్మోన్ల విడుదలలో జరిగే మార్పుల వల్ల ఇది వస్తుంది. మెనోపాజ్​ తర్వాత వచ్చే సమయాన్నే పోస్ట్​ మెనోపాజ్​ అంటారు. ఈ దశలో చాలామంది మహిళలకు పీరియడ్స్​ రావు. అయితే కొందరిలో మెనోపాజ్​ దశ తరహా లక్షణాలే  ఇంకా కంటిన్యూ అవుతాయి.