
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఆస్తిని ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ ఆస్తిని తన భార్య, దివంగత నటి శ్రీదేవి 1988లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో కోనుగోలు చేసినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ముగ్గురు వ్యక్తులు ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకుని హక్కులు కూడా కైయిమ్ చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.
ఈ కేసును విచారించి జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సదరు ముగ్గురు వ్యక్తుల పేరుతో ఉన్న మోసపూరిత వారసత్వ ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని , నాలుగు వారాలలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 22, 2025న తమ ఆస్తిని అక్రమంగా ఆక్రమించుకున్నారని , దీనిని పరిష్కరించాలని కోరుతూ.. న్యాయస్థానంలో కపూర్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో శ్రీదేవి ఏప్రిల్ 19, 1988న ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. అప్పటినుంచి ఆమె, ఆమె కుటుంబ సభ్యులు దీనిని పూర్తిస్థాయిలో అనుభవిస్తున్నారు. ఈ భూమికి అసలైన యజమాని ఎం.సి. సంబంధ ముదలియార్. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1960 ఫిబ్రవరి 14న కుటుంబ సభ్యులు ఆస్తిని పంచుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఆధారంగానే శ్రీదేవి ఈ ఆస్తిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బోనీ కపూర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే, ముదలియార్ కుమారులలో ఒకరి రెండో భార్య, ఆమె ఇద్దరు పిల్లలు తమకు ఆ ఆస్తిలో వాటా ఉందని చెబుతూ వాదనకు దిగారు. వీరు 2005లో తాంబరం తహసీల్దార్ నుండి వారసత్వ ధ్రువపత్రాన్ని కూడా పొందారు. అయితే, ముదలియార్ కుటుంబం మైలాపూర్‌లో నివసించేదని, తాంబరంలో కాదని బోనీ కపూర్ కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో, తాంబరం తహసీల్దార్‌కు ఈ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం లేదని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా, రెండో భార్య ఫిబ్రవరి 5, 1975న వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. కానీ, ఆ కుమారుడి మొదటి భార్య జూన్ 24, 1999న చనిపోయారు. కాబట్టి, రెండో పెళ్లి చట్టబద్ధం కాదని బోనీ కపూర్ వాదించారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం, ఈ ముగ్గురు వ్యక్తులు క్లాస్-1 లేదా క్లాస్-2 వారసులుగా పరిగణించబడరని ఆయన అన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు మోసపూరిత వారసత్వ ధ్రువపత్రాన్ని అడ్డుపెట్టుకుని, తమ ఆస్తిపై హక్కుల కోసం కోర్టులో అనేక కేసులు వేస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని, కాబట్టి ఆ సర్టిఫికెట్‌ను త్వరగా రద్దు చేయాలని బోనీ కపూర్, కోర్టును , అధికారులను కోరారు. దీంతో దీనిపై పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు ఈ ముగ్గురు వ్యక్తులకు మోసపూరిత వారసత్వ పత్రాలను రద్దు చేయాలని తహసీల్దార్ కు కోర్టు ఆదేశించింది.