సింగరేణి కార్మికులకు త్వరలోనే బోనస్:సీఎండీ శ్రీధర్ వెల్లడి

సింగరేణి కార్మికులకు త్వరలోనే బోనస్:సీఎండీ  శ్రీధర్ వెల్లడి
  • రూ.700 కోట్ల లాభాలు పంచుతం 
  • ఐదేండ్లలో 12 కొత్త గనులు ప్రారంభిస్తం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్మికులకు లాభాల బోనస్  కింద త్వరలో రూ.700 కోట్లు చెల్లించనున్నట్లు  ఆ సంస్థ  సీఎండీ  శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్​లోని సింగరేణి భవన్ లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను  మంగళవారం ఎగురవేశారు. పలువురు ఉత్తమ అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వచ్చే ఐదేండ్లలో 12 కొత్త మైన్స్​ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
100మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి,  రూ.50 వేల కోట్ల టర్నోవర్ సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.   పోటీ మార్కెట్​లో నిలబడాలంటే ఖర్చులు తగ్గించి, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో 9 ఏండ్లలో దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ సాధించని టర్నోవర్ ను, లాభాలను సాధించిందన్నారు.  తెలంగాణ రాక ముందు కార్మికులకు రూ .83 కోట్ల  లాభాల బోనస్​గా చెల్లించగా.. ఈ ఏడాది రూ.700 కోట్ల  లాభాల బోనస్​ను  దసరా పండుగకు ముందే  పంపిణీ చేస్తామన్నారు.  
2029–-30 నాటికి సింగరేణి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి  మైలు రాయి దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.  అనంతరం జీఎం(కో ఆర్డినేషన్)  ఎం.సురేశ్​ను సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్వైజర్లు  డి.ఎన్.ప్రసాద్(మైనింగ్),  సురేంద్ర పాండే(ఫారెస్ట్రీ), ఈడీ(కోల్ మూమెంట్)  జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం(మార్కెటింగ్)  జి.దేవేందర్, అడ్వైజర్​ (లా) లక్ష్మణ్​రావు, సీఎంవో ఏఐ జనరల్ సెక్రెటరీ  ఎన్.వి.రాజశేఖరరావు పాల్గొన్నారు.