
గచ్చిబౌలి, వెలుగు : సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందిన డా. సత్య గాయత్రి జనమంచి రాసిన థీసిస్ బుక్ ను సోమవారం సాయంత్రం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. చండ కౌశికమ్, తపణీ సంవరణం, సుభద్రా ధనుంజయం, ఛత్రపతి సామ్రాజ్యం లాంటి నాటకాల మీద పరిశోధన రూపంలో ఎన్నో కొత్త విషయాలను పుస్తక రూపంలో తీసుకొచ్చిన సత్యగాయత్రికి ఆయన అభినందనలు తెలిపారు.
‘ తెలుగు కావ్యాలుగా రూపొందిన సంస్కృత నాటకాలు-– పరిశీలన’ అనే అంశంపై ఆచార్య రేమెల్ల వెంకట రామకృష్ణ శాస్త్రి పర్యవేక్షణలో థీసిస్ ను పూర్తి చేసి డాక్టరేట్ పొందినట్లు సత్యగాయత్రి జనమంచి తెలిపారు. కార్యక్రమంలో హెచ్ సీయూ తెలుగు శాఖ హెడ్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తార ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం. మంజుశ్రీ, కోటపల్లి సీతారామమూర్తి, సత్య దుర్గాంబ, డా. నలసాని రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.