పుస్తకాల రేట్లు తగ్గినయ్

పుస్తకాల రేట్లు తగ్గినయ్
  •     ఒక్కో టెక్స్ట్ బుక్​పై రూ.10 నుంచి రూ.74  వరకు తగ్గించిన సర్కారు 
  •     ఒక్కో క్లాస్​కు రూ.200 నుంచి రూ.370 దాకా తగ్గే అవకాశం
  •     పేరెంట్స్ కు పుస్తకాల భారం నుంచి కొంత ఊరట 
  •     పేపర్ మందం కూడా తగ్గించిన ప్రభుత్వం
  •     స్టూడెంట్లకూ తగ్గనున్న బ్యాగ్ మోత  

హైదరాబాద్, వెలుగు :  విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారంగా మారిన పాఠ్యపుస్తకాల ధరలను కొంతమేర తగ్గించింది. ఒక్కో పుస్తకంపై కనీసం రూ.10 నుంచి రూ.74 వరకు తగ్గించింది. దీంతో ఒక్కో క్లాస్​కు రూ.200 నుంచి రూ.370 దాకా రేటు తగ్గనుంది. అన్ని మీడియాలకు చెందిన పుస్తకాల ధరలూ తగ్గనున్నాయి. సర్కారు నిర్ణయంతో పేరెంట్స్ కు పుస్తకాల భారం నుంచి కొంత ఊరట లభించినట్టు అయింది. మరో పక్క పుస్తకాల పేపర్​మందం తగ్గించి.. స్టూడెంట్ల బ్యాగు మోతను తగ్గించింది. 

స్టేట్​లో జూన్ 12 నుంచి 2024–25 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 60 లక్షల మంది వరకు చదువుతున్నారు. ప్రైవేటు బడుల్లో చదివే పిల్లల కోసం ఇప్పటి నుంచే పుస్తకాలు, బ్యాగులు, షూస్ తదితర వస్తువులు కొనే పనుల్లో పేరెంట్స్ నిమగ్నమయ్యారు. మార్కెట్లో జూన్ ఫస్ట్ వీక్​ నుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పుస్త కాల రేట్లు తగ్గించేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నది. 2023-–24 విద్యా సంవత్సరంలో టెన్త్ క్లాసు మొత్తం పుస్తకాలకు రూ.1,482 కాగా.. ఈసారి ఆ ధర రూ.1,126 కు తగ్గింది. అంటే.. ఒక్క క్లాసుకే రూ.356 తగ్గినట్టు అయింది. దీంతో పేరెంట్స్​కు కొంత ఊరట లభించనుంది. 

బ్యాగ్ బరువూ తగ్గింది..

2023–24 విద్యా సంవత్సరంలో పుస్తకాల్లోని లోపలి పేజీలకు 90 జీఎస్ఎం (గ్రామ్స్​పర్​ స్క్వేర్​ మీటర్)  కాగితాన్ని, కవర్ పేజీలకు 220 జీఎస్​ఎం కాగితాన్ని వాడారు. కానీ, ఈ విద్యాసంవత్సరం ప్రింట్ చేసిన పుస్తకాల్లోని లోపలి పేజీలకు 70 జీఎస్​ఎం కాగితం, కవర్ పేజీలకు 200 జీఎస్​ఎం కాగితం వినియోగించారు. దీంతో పుస్తకాల్లోని పేపర్ మందం తగ్గడంతో ఒక్కో క్లాసుకు కేజీ దాకా బరువు తగ్గనుంది. ఉదాహరణకు ఇప్పటి వరకు టెన్త్ పాఠ్యపుస్తకాల బరువు 4 కిలోల దాకా ఉండగా.. ప్రస్తుతం అది 3 కిలోలకు తగ్గనున్నది. 

పేపర్ ధర తగ్గడంతోనే..

గతేడాదితో పోలిస్తే  మార్కెట్లో పేపర్ రేట్ తగ్గింది. 2023–24 విద్యా సంవత్సరంలో ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.1.21 లక్షలు ధర ఉండగా.. ఈ సారి రూ.1.04 లక్షలకు తగ్గింది. దీంతో సర్కారు కూడా డబ్బులు మిగిలించుకోకుండా.. ప్రైవేటు విద్యార్థులపై భారం పడకుండా పుస్తకాల ధరను తగ్గించేందుకు నిర్ణయంతీసుకున్నది. 

ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు: 

ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు జూన్ 3 నుంచి పుస్తకాలను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే దుకాణాల్లో పుస్తకాలను అమ్మాలి. ఎక్కువ ధరకు అమ్మితే మాకు ఫిర్యాదు చేయాలి.  వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు స్కూళ్లు రీఓపెన్ రోజే పుస్తకాలను అందించేందుకు ఏర్పాట్లు చేశాం. 

శ్రీనివాస్​ చారి, టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్ 

టెన్త్ పుస్తకాల రేట్లు(రూ.లలో)..

సబ్జెక్టు     2023     2024
తెలుగు    144      109
హిందీ     69      52
ఇంగ్లిష్      207      157
మ్యాథ్స్      309      235
బయోలజీ       195      148
ఫిజిక్స్      243      185
సోషల్     264      201
పర్యావరణ విద్య    51     39