ప్రధాని పేరు మీదనే ఓట్లు అడుగుతం : బూర నర్సయ్య గౌడ్

ప్రధాని పేరు మీదనే ఓట్లు అడుగుతం : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: తమ బ్రాండ్ అంబాసిడర్ ప్రధాని మోదీ అని, ఆయన పేరు మీదనే తెలంగాణలో ఓట్లు అడుగుతామని బీజేపీ భువనగిరి లోక్ సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్భాటాలు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఒక ఆకు ఎక్కువ చదివారని, ఈ ప్రభుత్వం ఉంటుందో, ఉడుతుందో తెలియదు కనుకే.. సీఎం ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌తో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి విస్మరించారన్నారు. మెజార్టీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ అమలు చేయడం లేదన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.10లక్షల అమలు అనేది ఒక బోగస్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అర్జంట్‌గా హోంమంత్రి కావాలని రాజ్ గోపాల్ రెడ్డి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి హవాలో రాజ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.