హెల్త్​కేర్​, ఫ్రంట్​లైన్​ వర్కర్లు, వృద్ధులకు బూస్టర్​ డోస్

హెల్త్​కేర్​, ఫ్రంట్​లైన్​ వర్కర్లు, వృద్ధులకు బూస్టర్​ డోస్
  • త్వరలోప్రపంచంలోనే తొలి డీఎన్ఏ, నాజల్ వ్యాక్సిన్లు
  • ఒమిక్రాన్ వ్యాపిస్తున్నందున జాగ్రత్తలు తప్పనిసరి
  • మాస్క్, సోషల్​ డిస్టెన్స్​, వ్యాక్సిన్లే శ్రీరామరక్ష
  • ఇప్పటిదాకా దేశంలో 141 కోట్ల వ్యాక్సిన్​ డోస్​లు వేశాం
  • 18 లక్షల ఐసోలేషన్​ బెడ్లు రెడీగా ఉన్నాయన్న ప్రధాని


న్యూఢిల్లీ: కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లకు, వృద్ధులకు ప్రికాషనరీ (బూస్టర్) వ్యాక్సిన్ డోస్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. 60 ఏండ్లు దాటినోళ్లతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా డాక్టర్ల సలహా మేరకు బూస్టర్ డోసులు అందుబాటులో ఉంచుతామని ప్రధాని మోడీ ప్రకటించారు. జనవరి 10 నుంచి ఈ డోసులను మొదలు పెట్టనున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ ఇక పిల్లలకు కూడా అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. 15 నుంచి 18 ఏండ్ల  వయసు వారికి వ్యాక్సినేషన్ జనవరి 3 నుంచి మొదలు పెడతామని పేర్కొన్నారు. దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి కరోనాపై చేస్తున్న పోరాటాన్ని ఈ నిర్ణయం మరింత బలోపేతం చేస్తుందన్నారు. అంతేగాక స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లలో, వారి తల్లిదండ్రుల్లో కరోనా విషయమై ఉన్న ఆందోళనను దూరం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాజల్ (ముక్కు ద్వారా వేసే) వ్యాక్సిన్, ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ కూడా త్వరలో దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు ప్రకటించారు. మోడీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ రోజు  క్రిస్మస్ పర్వదినం. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి కూడా. కరోనాపై పోరాటంలో కొన్ని కీలక నిర్ణయాలను దేశ ప్రజల ముందుంచేందుకు ఇదే సరైన ముహూర్తం అనిపించింది. 2021 ముగింపునకు వచ్చింది. 2022ను ఆనందోత్సాహాలతో స్వాగతించేందుకు ప్రజలంతా రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది” అని అన్నారు. ప్రపంచమంతటినీ వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కు భయపడొద్దని ప్రజలను కోరారు. ‘‘ఫిజికల్ డిస్టెన్స్, మాస్కు, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు ఇప్పుడు మరింత కీలకమని, తప్పనిసరి అని అర్థం చేసుకోవాలి. కరోనాపై పోరాటంలో ఇవే అతి పెద్ద ఆయుధమని గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ విధిగా తీసుకోవాలి. కరోనాపై పోరాటంలో అది రెండో ఆయుధం” అని సూచించారు.

వేగంగా వ్యాక్సినేషన్
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ప్రధాని అన్నారు. కరోనాపై పోరులో భారత్ ను ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిపేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ‘‘కరోనా ముప్పు పెరుగుతోంది. దాంతోపాటే దాన్ని ఎదుర్కోవడంలో మన సంకల్పం కూడా నానాటికీ బలోపేతం అవుతూ వస్తోంది. ఇన్నొవేటివ్ స్పిరిట్ కూడా పెరుగుతోంది. కరోనాకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని దేశ ప్రజలతో ఎప్పటికప్పుడు ఎలా పంచుకోవాలి, వారిని ఎలా అలర్ట్ చేయాలి, ఒక్కో డోసు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, కరోనా బారిన పడ్డ వాళ్లకు ట్రీట్ మెంట్, వ్యాక్సిన్ తదితరాలపై ఎప్పటికప్పుడు సైంటిస్టుల సూచనల మేరకు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాం. పరిస్థితిని అదుపు చేసేందుకు ఇవన్నీ ఎంతో సాయపడ్డాయి. వీటి ఫలితంగానే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఏకంగా 141 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశాం. 90 శాతం వృద్ధులకు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందింది. దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మన సైంటిస్టులు దీనిపై ఇప్పటికే లోతుగా రీసెర్చ్ చేస్తున్నారు. త్వరలో వారినుంచి శుభవార్త వింటామని నా నమ్మకం” అని అన్నారు. కరోనాపై పుకార్లను, భయాందోళనలు వ్యాప్తి చేసే ప్రయత్నాలను నమ్మొద్దని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ‘‘దేశవాసులమంతా కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. దీన్ని మున్ముందు ఇంకా పెంచుకుందాం” అని పిలుపునిచ్చారు. టూరిజంలో కీలకమైన గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి రాష్ట్రాల్లో 100 శాతం మొదటి డోసు పూర్తయిందన్నారు.