రెండేండ్లలో రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు

రెండేండ్లలో రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు
  • 2024, 2025 దావోస్ సదస్సు ద్వారానే 44 సంస్థలతో ఒప్పందం
  • మూడేండ్లలో టీజీఐపాస్​లో ఎంఎస్ఎంఈల ద్వారా రూ.48 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులు జోరందుకున్నాయి. గత రెండేండ్లలోనే చిన్నా పెద్ద కంపెనీలన్నింటితో కలిపి రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు పరిశ్రమల శాఖ లెక్కలు చెబుతున్నాయి. 2024లో దావోస్​లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 18 కంపెనీలతో ఒప్పందం కుదరగా.. రూ.40,832 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2025 సదస్సులో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులతో 26 సంస్థలు తెలంగాణతో ఒప్పందం చేసుకున్నాయి. 

ఇప్పటికే 2024లో ఒప్పందం చేసుకున్న సంస్థలు రాష్ట్రంలో సంస్థలను స్థాపిస్తుండగా.. దాదాపు 75 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో 50 శాతం ఉద్యోగాలు ఐటీ, ఐటీ సేవల సంస్థల నుంచే వస్తుండడం విశేషం. మిగతా ఉద్యోగాలు లైఫ్​సైన్సెస్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల నుంచి వస్తున్నాయి.  

ఎంఎస్ఎంఈల ద్వారా మరిన్ని పెట్టుబడులు  

టీజీఐపాస్ లెక్కల ప్రకారం ఎంఎస్ఎంఈల ద్వారా కూడా మరిన్ని పెట్టుబడులు సమకూరాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.28,088 కోట్ల పెట్టుబడులు రాగా.. 84,249 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.13,720 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50 వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇక, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6,500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. 31,257 మందికి ఉపాధి లభించింది. ఈ మూడేండ్లలో 5,812 ఎంఎస్ఎంఈలే పెట్టుబడులు పెట్టడం విశేషం. చిన్నా పెద్ద సంస్థలు కలిపి.. 5,960 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి.