ఆడవాళ్లకు పొద్దున్నే లేవగానే మొదలయ్యే పెద్ద టాస్క్ బ్రేక్ ఫాస్ట్. ఏం చేయాలో అస్సలు తోచదు. ఇడ్లీ, దోశ, పూరీ ఇవి రొటీన్. తినేవాళ్లు వండే వాళ్లకు కూడా బోర్ అనిపిస్తాయి ఒక్కోసారి ఈ టిఫిన్లు. అందుకే, ఎప్పుడూ చేసే దోశ కాకుండా ఈవారం వెరైటీ దోశలు ట్రై చేయండి. టొమాటో పచ్చడి ఉంటే చాలు దోశలను తెగ లాగించేస్తారు పిల్లలు. ఎలాగూ ఎండాకాలం కాబట్టి దానికి తోడుగా ఈ జ్యూస్లు చేయండి.. అటు టేస్టీ. ఇటు హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఒకేసారి అయిపోతుంది.
బీట్ రూట్ ఓట్స్
కావాల్సినవి:
పచ్చిమిర్చి: రెండు
జీలకర్ర: కొద్దిగా
బీట్ రూట్ తరుగు: 3/4 కప్పు
ఓట్స్: అరకప్పు
కొత్తిమీర: మూడు టేబుల్ స్పూన్లు
గోధుమపిండి: అరకప్పు
బొంబాయి రవ్వ: 1/3 కప్పు
ఉప్పు : తగినంత
పెరుగు: రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు: తగినన్ని
నూనె: కొద్దిగా
తయారీ:
పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, బీట్ రూట్ తరుగు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఒక గిన్నెలో ఓట్స్ పొడి, గోధుమపిండి, రవ్వ,
ఉప్పు, పెరుగు వేసి అన్ని కలపాలి. తర్వాత బీట్ రూట్ పేస్ట్ వేసి నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా జారుగా కలపాలి. పొయ్యిమీద పెనం పెట్టి దోశలా వేసుకుని నూనె లేదా నెయ్యివేసి మూతపెట్టి రెండువైపులా కాల్చాలి. దీనికి కాంబినేషన్ మూంగ్ బీన్ జ్యూస్ కలిపి తాగొచ్చు.
బనానా మిల్క్ షేక్
కావాల్సినవి:
అరటి పండ్లు: రెండు
జీడిపప్పు పలుకులు: కొన్ని
తేనె: మూడు టేబుల్ స్పూన్లు
పాలు: ఒక కప్పు
బాదంపప్పు; కొద్దిగా
తయారీ:
మిక్సీ గిన్నెలో అరటిపండు ముక్కలు, జీడిపప్పు, తేనె, పాలుపోసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత సర్వింగ్ గ్లాసులో రెండు ఐస్ క్యూబ్స్ వేసి ఈ మిల్క్ షేక్ పోసి బాదం పలుకులతో గార్నిష్ చేయాలి.
