వ్యాక్సిన్ వేసుకుంటే 98 శాతం సేఫ్

వ్యాక్సిన్ వేసుకుంటే 98 శాతం సేఫ్
  • రెండు డోసుల తర్వాత మరణించే ముప్పు చాలా తక్కువ
  • ఒక్క డోస్‌తో డెత్ చాన్స్ 92 శాతం తగ్గుతది: వీకే పాల్
  • పంజాబ్‌ పోలీసులపై వ్యాక్సిన్ పనితీరు స్టడీ

న్యూఢిల్లీ: కరోనా కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమేనని మరో అధ్యయనంలో తేలింది. రెండు డోసులు టీకా తీసుకున్నాక వైరస్ సోకినా చనిపోయే ముప్పు మాత్రం 98 శాతం తగ్గిపోతుందని పంజాబ్ పోలీసులపై ప్రభుత్వం నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. అయితే ఒక్క డోసు వేసుకున్నా 92 శాతం సేఫ్ అని రుజువైంది. పంజాబ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌తో కలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పనితీరుపై అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ మీడియాకు వెల్లడించారు.
42 వేల మందిలో ఇద్దరు మృతి
‘‘పోలీసులు హైరిస్క్ గ్రూప్‌లో వస్తారు. కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువ. పంజాబ్‌లో 35,856 మంది పోలీసు సిబ్బంది ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఆ తర్వాత వారిలో 9 మంది కరోనాతో మరణించారు. అంటే వెయ్యి మందిలో డెత్ రేటు 0.25గా ఉంది. ఇక 42,720 మంది రెండు డోసులూ తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మరణించారు. అంటే వెయ్యి మందిలో డెత్ రేటు 0.05గా ఉంది” అని వీకే పాల్ తెలిపారు. ఒక్క డోసు వేసుకున్నా  కరోనా వల్ల చావు రాకుండా తప్పించుకునే చాన్స్ 92 శాతంగా ఉందని, రెండు డోసులు వేసుకుంటే 98 శాతం సేఫ్టీ ఉన్నట్టేనని తేలిందని ఆయన చెప్పారు. స్టడీలో భాగంగా 4,868 మంది వ్యాక్సిన్ వేసుకోని పోలీసులను పరిశీలించగా వారిలో 15 మంది మరణించారని, ఇక్కడ డెత్ రేటు 3.08గా ఉందని అన్నారు. కరోనాతో సీరియస్ సమస్యలు, మరణం రాకుండా వ్యాక్సినేషన్ ద్వారా తప్పించుకోవచ్చని ఈ స్టడీ ద్వారా మరోసారి తేలిందని ఆయన చెప్పారు. అందుకే ఎటువంటి అపోహలు లేకుండా  కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వీకే పాల్ సూచించారు.