
యాభై ఏళ్లకు పైగా దేశంలో కొనసాగుతున్న కమ్యూనిస్టు విప్లవోద్యమ సాయుధ పోరాటానికి మరో ముగింపు చాలా దగ్గరలోనే ఉన్నట్లు నేటి పరిస్థితులు చెబుతున్నాయి. ఎదుగుతూ, అణచివేయబడుతూ ఉన్నఈ యుద్ధ చరిత్రలో ఇంతగా సంక్షోభంలో చిక్కుకున్న సందర్భమిదే. కాలం కలిసిరానపుడు 'రెండడుగులు వెనకకు' అనే సూత్రీకరణ ఉన్నా, వెనుకడుగుల లెక్క తప్పి ముందడుగు ఆశలు కోల్పోతున్నపుడు ఈ ముగింపు ఘోరమైన ఓటమిని, తీవ్రమైన నిరాశను కల్పిస్తోంది.
అయితే నక్సల్బరీ, శ్రీకాకుళం, జగిత్యాల -సిరిసిల్లల్లో సాగిన విప్లవోద్యమం స్థానభ్రంశం చెందింది తప్ప ఇంతగా ఎప్పుడూ పెకిలించలేదు. సాయుధ పోరాటం ఏదో రూపంలో, ఏదో ప్రాంతంలో సజీవంగానే ఉంటూ వస్తోంది. దానిని నిర్మూలించే శక్తి పుట్టలేదు, పుట్టబోదు అనే జన విశ్వాసానికి ప్రస్తుత ప్రభుత్వ చర్య పూర్తి విఘాతాన్ని కలిగిస్తోంది.
అణచివేతను ఎదుర్కోలేనప్పుడు నక్సలైట్లు మరో సురక్షిత జనావాస ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. ఇప్పుడు గతంలో మాదిరిగా ప్రజల్లోనే ఉంటూ అజ్ఞాతజీవితం గడిపే పరిస్థితులు లేవు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు దుర్గమ అడవుల్లో స్థావరాలు ఏర్పరచుకొని దినమొక గండంగా బతుకులీడ్చే కాలమొచ్చింది. బలగాల తూటాలకు మావోయిస్టులు బలికావడం నిత్యకృత్యమైంది.
సాయుధ పోరు కొత్త కాదు
భారతీయులకు సాయుధ పోరు కొత్త కాదు. మార్క్స్, లెనిన్, మావోల బాటలోనే తిరుగుబాటు నేర్చుకోలేదు. స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారితో జరిగిన పోరాటంలోనూ సాయుధ మార్గం ఉంది. నేతాజీ, భగత్ సింగ్, అల్లూరి తదితరులు బ్రిటిష్ వారిపై ప్రకటించిన సాయుధ తిరుగుబాటును ప్రజలు నేటికీ కీర్తిస్తారు. విదేశీ సిద్ధాంతంలోంచి నేర్చుకున్నది శ్రామికులకు గిట్టుబాటు కూలి రావాలనేదే. మన దేశంలో వెట్టి చాకిరీలాంటి శ్రమ దోపిడీతోపాటు కుల వివక్ష ప్రజలను సాయుధులని చేసింది. నక్సలైట్లకు సైద్ధాంతిక మార్గం ఉండవచ్చు... కానీ, పీడిత ప్రజలకు మాత్రం ఎలాగైనా ఈ దొరతనం ముప్పు పోవాలి అనే కోరుకున్నారు. శ్రామికుల ప్రయోజనం కోసం సాయుధ కమ్యూనిస్టులు పోరాడారు.
గన్ పాయింట్
ఆయుధం జన పీడకులను మట్టుబెట్టింది, ప్రాణభీతిని కలిగించింది, గన్ పాయింట్ తన దారిలోకి తెచ్చింది, ఊర్ల నుంచి ఉరికించింది. ఇలా సామాన్యులకు అందిన ఫలితాలు ఉత్త చేతులతో సాధ్యపడేవి కాదు. ఒకప్పుడు విజయాలు అందించిన అదే ఆయుధం ఇప్పుడు వారికి ప్రాణాంతకమైంది. ఏమైనా చేసుకోండి కానీ అనుమతి లేకుండా ఆయుధాలను ధరించే హక్కు ఎవరికీ లేదు అని ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వాలు అంటున్నాయి.
మావోయిస్టుల ఏరివేత తీవ్రస్థాయిలో ఉన్న ఈ సంకట స్థితిలో శాంతిచర్చలకు పార్టీ తల వంచినా, ఆయుధాన్ని వదిలేయమని ప్రభుత్వం నిబంధన పెడుతోంది. ఆయుధం లేకుండా విప్లవోద్యమమే లేదని పార్టీ అంటోంది. ఆయుధం పట్టుకుంటే మీ ప్రాణాలే ఉండవు అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. తాము చచ్చినా పర్వాలేదు సిద్ధాంతాన్ని చంపుకోం అని పోరాటానికి మొగ్గు చూపుతున్నవారు కొందరైతే ఈ అమరత్వం కన్నా తుపాకీ వదిలేయడమే నేటి అనుకూల మార్గమని కొందరివాదన బయటపడింది.
శాంతి చర్చల ద్వారానే పరిష్కారం
ఈ నేపథ్యంలో సోను పేరిట బయటపడిన లేఖ ఒక్కసారిగా అందరిని షాక్కు గురి చేసింది. ఇంతకాలం తాము పాటించిన మార్గం వల్ల దక్కిన ఫలితంకన్నా నష్టాలే ఎక్కువ. తుపాకీ వల్ల ఇకముందు ఏమి సాధించలేమని నమ్మి, ఆయుధాలను వదిలేసేందుకు పార్టీ సిద్ధమవుతోంది అనే అర్థం వచ్చేలా ఆ లేఖ ఉంది. ఇన్నేళ్ల తమ మార్గమే తప్పు అని ఒప్పుకుంటున్నట్లు వాక్యాలు ఆ లేఖలో ఉన్నాయి. ఆ తర్వాత సోను పేరిట వచ్చిన లేఖను ఖండిస్తూ అభయ్, వికల్ప్ పేరిట వచ్చిన లేఖల వల్ల పార్టీ విధానాలపై స్పష్టత వచ్చింది.
సోను పేరిట వచ్చిన లేఖ రాసిన ఆ ఒక్కడి వ్యక్తిగత నిర్ణయమని, ఆయన లొంగిపోదలుచుకుంటే పార్టీని వీడవచ్చని తర్వాతి ఉత్తరాల్లో ఉంది. సిద్ధాంతాన్ని, పార్టీని, సాయుధ మార్గాన్ని నమ్ముకున్నవారు ప్రభుత్వ బలగాలకు ఎదురొడ్డి ఆత్మ రక్షణలో ఎక్కడో తలదాచుకుని తిరిగి బలపడడమో జరగవచ్చు. మావోయిస్టులు లొంగిపోవాలనే ప్రభుత్వ డిమాండ్ బలప్రయోగం ద్వారా కాకుండా శాంతి చర్చల ద్వారానే తేలే విషయం. ప్రభుత్వ అణచివేత విధానం వల్ల ఉద్యమం నివురు కప్పుకోవచ్చు. కానీ, నిప్పు మాత్రం ఆరదు.
- బద్రి నర్సన్