సిరీస్‌‌ ఎవరిదనేది బౌలర్లే నిర్ణయిస్తారు

సిరీస్‌‌ ఎవరిదనేది బౌలర్లే నిర్ణయిస్తారు

న్యూఢిల్లీ: ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌‌ భవితవ్యాన్ని బౌలర్లే నిర్ణయిస్తారని టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ చెప్పాడు. ఇరు జట్లలోనూ వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నందున వారి రాణింపుపైనే సిరీస్ ఎవరిదనేది ఆధారపడి ఉంటుందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్లతో ఇరు జట్ల పేస్ అటాక్ భీకరంగా ఉన్న నేపథ్యంలో టోర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌‌గా సాగుతుందని జహీర్ అన్నాడు.

‘ఆస్ట్రేలియా పిచ్‌‌లపై ఎప్పుడూ మంచి పేస్, బౌన్స్ ఉంటుంది. వన్డేలు, టీ20లు, టెస్టుల భవితవ్యాన్ని బౌలర్లే నిర్ణయిస్తారు. ప్రత్యర్థిని ఎంత తక్కువ స్కోరుకు పరిమితం చేస్తారనే దానిపై ఆయా జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. వరల్డ్ టాప్ లైన్ బౌలర్లు ఈ సిరీస్‌‌లో బౌలింగ్ చేయనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తిరిగిరావడంతో ఆసీస్‌‌‌ టీమ్‌‌ భారత్‌‌కు పెను సవాల్ విసురుతోంది. గత టూర్‌‌తో పోల్చితే ఈ సిరీస్ ఇండియాకు విషమ పరీక్షే అని చెప్పాలి. అయితే కంగారూ పిచ్‌‌లపై ఆడిన అనుభవం మన ప్లేయర్లకు కలసిరానుంది. ఎలా ఆడితే విజయవంతం అవుతామనేది భారత ఆటగాళ్లకు తెలుసు. తమ పేస్ అటాక్‌‌తో చరిత్రను మరోసారి తిరగరాయడానికి ఇండియా బౌలర్లు సమాయత్తం అవుతున్నారు. వారిపై నాకు చాలా నమ్మకం ఉంది’ అని జహీర్ పేర్కొన్నాడు.