దొంగతనం నెపంతో .. బాలుడిని చితకబాదిన వ్యక్తి

దొంగతనం నెపంతో  .. బాలుడిని చితకబాదిన వ్యక్తి

అమ్రాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా పదర మండలం ఇప్పలపల్లిలో డబ్బులు దొంగిలించాడనే నెపంతో ఓ బాలుడిని గ్రామస్తులు విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మేనావట్ నర్సింహ ఇంట్లో అతడి అన్న కొడుకు శివ రూ.70 వేలు దొంగతనం చేసి మరో ఐదుగురు పిల్లలకు పంచాడు. 

అయితే, ఇదే గ్రామానికి చెందిన రుమావత్ నిర్మల కొడుకు రంజిత్(11) ఆ డబ్బులు తీశాడనే అనుమానంతో విచక్షణారహితంగా కొట్టారు. తాను తీయలేదని చెప్పినా వినకుండా కరెంట్ షాక్  కూడా పెట్టారు. దీంతో బాలుడు తానే దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చాక దెబ్బల బాధ భరించలేక ఉరేసుకోబోయాడు. గమనించిన కుటుంబసభ్యులు కాపాడారు. తండ్రి లేని బాలుడని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారని కుటుంసభ్యులు ఆరోపించారు. బాలుడికి గొంతు చుట్టూ, వీపుపై గాయాలైనట్లు తెలిపారు. ఎస్ఐ రాజు మాట్లాడుతూ బాలుడిపై దాడి ఘటనకు సంబంధించి తమకు ఫిర్యాదు అందలేదని, కంప్లయింట్​వస్తే విచారణ చేస్తామని చెప్పారు.