
కుషాయిగూడ, వెలుగు: కొబ్బరిముక్క నోట్లో ఇరుక్కొని మూడేండ్ల బాలుడు మృతిచెందాడు. హైదరాబాద్ లోనికుషాయిగూడ పీఎస్పరిధిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పరిధి చర్లపల్లి డివిజన్ సోనియాగాంధీనగర్లో నివసిస్తున్న శ్రీకాంత్, త్రివేణి దంపతులకు ఇద్దరు కొడుకులు. శ్రీకాంత్ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
గురువారం తొలి ఏకాదశి పండుగ కావడంతో పొద్దుగాల్నే గుడికి వెళ్లి వచ్చారు. గుడిలో కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు తెచ్చి ఇంట్లో పెట్టారు. చిన్న కొడుకు జశ్వంత్(3) వాటిలో ఒక ముక్క తినేందుకు ప్రయత్నిస్తుండగా నోట్లో ఇరుక్కుంది. గమనించిన తల్లిదండ్రులు కొబ్బరి ముక్కను తీస్తుండగానే జశ్వంత్ఊపిరి ఆగిపోయింది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ప్రాణం కండ్లముందే పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.