నిఫా బారినపడిన కేరళ బాలుడు గుండెపోటుతో మృతి

నిఫా బారినపడిన కేరళ బాలుడు గుండెపోటుతో మృతి

కోజికోడ్: కేరళలోని మలప్పురంలో నిఫా వైరస్  బారినపడిన బాలుడు (14) ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. పండిక్కడ్ కు చెందిన బాలుడు.. కోజికోడ్ లోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతుండగా కార్డియాక్ అరెస్టుకు గురై ప్రాణాలు కోల్పోయాడని కేరళ వైద్య మంత్రి వీణా జార్జి తెలిపారు. బాలుడిని కాపాడేందుకు డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేదని ఆమె చెప్పారు. ‘‘నిఫా వైరస్  బారినపడినప్పటి నుంచి బాలుడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స ఇప్పిస్తున్నాం.

ఆదివారం ఉదయం నుంచి బాలుడికి మూత్రం రాలేదు. ఈ క్రమంలో ఉదయం 10.50 గంటలకు బాలుడికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. బాలుడిని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. 11.30 గంటలకు అతను చనిపోయాడు. అంతర్జాతీయ ప్రొటోకాల్స్ ను అనుసరించి అతని అంత్యక్రియలు జరుపుతాం” అని మంత్రి వీణ వెల్లడించారు. బాలుడితో మొత్తం 246 మంది కాంటాక్ట్  అయ్యారని, వారిలో 63 మంది హైరిస్క్  కేటగిరిలో ఉన్నారని మంత్రి వివరించారు.

హైరిస్క్  ఉన్నవారిందరికీ టెస్టులు చేస్తామని, వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ముందుగా టెస్టులు చేస్తామని ఆమె చెప్పారు. నిఫా వైరస్ కు ఎపిసెంటర్ గా భావిస్తున్న పండిక్కడ్ తో పాటు రెండు పంచాయతీల్లో ఫీవర్  సర్వైలెన్స్  నిర్వహించాలని వైద్య శాఖను ఆదేశించామని తెలిపారు. మొత్తం 33 వేల ఇండ్లను సర్వైలెన్స్ లో కవర్  చేస్తామన్నారు. ఇక కోజికోడ్  మెడికల్  కాలేజీలో ప్రస్తుతం ముగ్గురు ఐసొలేషన్ లో ఉన్నారని ఆమె తెలిపారు. అలాగే నలుగురు హైరిస్క్  ఉన్నవారు మంజేరీ మెడికల్  కాలేజీలో చేరారని వెల్లడించారు.

కేరళకు కేంద్ర బృందం

నిఫా వైరస్​తో కోజికోడ్  మెడికల్  కాలేజీలో బాలుడు చనిపోవడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నిఫా వైరస్  కేసులపై  దర్యాప్తుకు ఒక బృందాన్ని పంపుతామని కేంద్ర వైద్యశాఖ తెలిపింది. చనిపోయిన బాలుడి శాంపుల్స్​ను పరీక్షించగా నిఫా వైరస్  ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. గబ్బిలాల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని, గబ్బిలాలు వాలిన పండ్లను తింటే దీని బారినపడతారని వెల్లడించింది.