సంగమేశ్వర ఆలయంలో సమస్యలెన్నో .. రెగ్యులర్ ఈవో లేక అవస్థలు

సంగమేశ్వర ఆలయంలో సమస్యలెన్నో .. రెగ్యులర్ ఈవో లేక అవస్థలు
  • మార్చి 5 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్
  • కొత్త పాలకవర్గం ఏర్పాటుపై నిర్లక్ష్యం

సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో సమస్యలు తిష్ట వేశాయి. శివరాత్రి సందర్భంగా మార్చి 5 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల తోపాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారు. 

అయినప్పటికీ జిల్లా యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆలయ పాలకవర్గ పదవీకాలం పూర్తయి 5 నెలలు గడిచినా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోలేదు. ఆలయ రెగ్యులర్ ఈవో లేకపోవడం వల్ల జాతర ఏర్పాట్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. టెంపుల్ మాస్టర్ ప్లాన్ ప్రపోజల్ స్థాయిలోనే ఆగిపోయింది. ఆలయ ప్రాకార నిర్మాణానికి అడ్డంకులు, పెండింగ్ లో నాలా డైవర్షన్, మహిళల కోసం గదుల కొరత, డబుల్ లైన్ రోడ్డు కోసం టెండర్లు పూర్తయినా ప్రారంభించని పనులు, వసతి గృహాల కొరత, పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. 

పాలకవర్గంపై నిర్లక్ష్యం

కేతకీ ఆలయ పాలకవర్గం ఏర్పాటుపై మొదటి నుంచి నిర్లక్ష్యం కొనసాగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 21న గత పాలకవర్గం పదవీకాలం ముగిసింది. ఆ టైంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నెలకొని పాలకవర్గం ఏర్పాటుపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండున్నర నెలలు అవుతున్నా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. 

ఇటీవల ఆర్డీవో రవీందర్ రెడ్డి సమక్షంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించినప్పటికీ వారం రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానుండగా ఏర్పాట్లపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు లేరు. పాలకవర్గం లేదు రెగ్యులర్ ఈవో లేక ఇన్‌చార్జి ఈవోతోనే నెట్టుకు రావడంతో సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కలెక్టర్ వెంటనే స్పందించి బ్రహ్మోత్సావాలకు ఏర్పాట్లు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

రూ.5 కోట్ల టెండర్లు

ఝరాసంగం కేతకీ ఆలయానికి చేరుకునేందుకు మండల కేంద్రంలో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం గత ఏడాది సెప్టెంబర్ లో మంజూరైంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు శాంక్షన్ చేసి అప్పట్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించింది. కానీ పనులు మాత్రం స్టార్ట్ చేయలేదు. కారణం రోడ్డు విస్తరణకు ఇరువైపులా ఉన్న కరెంటు స్తంభాల తొలగింపు సమస్యగా మారింది. వాటిని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాగా అందుకు కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫండ్స్ లేక పనులు స్టార్ట్ చేసేందుకు చర్యలు తీసుకోలేదు. దీంతో రోడ్డు వెడల్పు పనులు అక్కడే ఆగిపోయాయి.