40 ఏళ్లకే బ్రెయిన్‌‌ స్ట్రోక్‌‌…

40 ఏళ్లకే బ్రెయిన్‌‌ స్ట్రోక్‌‌…

    మరణాల్లో 20% స్ట్రోక్ వల్లే

    దేశంలో ప్రతి లక్ష మందిలో 150 మందికి ముప్పు

    హైపర్‌‌ టెన్షన్‌‌, స్మోకింగ్‌‌, డ్రగ్‌‌ ఎఫెక్ట్‌‌తో ప్రమాదం ఎక్కువ

ఫోన్‌‌ ఎక్కడో పెట్టి గుర్తు చేసుకోలేకపోవడం, ఎవరికో కాల్‌‌ చేద్దామని ఫోన్‌‌ తీసి మర్చిపోవడం, ఐరిస్‌‌ ఇవ్వడం మర్చిపోయి ఆఫీస్‌‌ బయటకొచ్చి ‘అరే’ అనుకోవడం.. రోజూ చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ మతిమరుపును చాలా వరకు ‘లైట్‌‌’గానే తీస్కుంటుంటాం. కానీ డాక్టర్లు మాత్రం ‘బీ కేర్‌‌ఫుల్‌‌’ అంటున్నారు. బ్రెయిన్‌‌పై ఒత్తిడికి మతిమరుపు కూడా ఓ ఇండికేషన్‌‌ అని చెబుతున్నారు. నిద్ర పట్టకపోవడం, నిద్ర లేచాక ఫ్రెష్‌‌గా ఉండకపోవడం, డిప్రెషన్‌‌ లాంటివన్నీ బ్రెయిన్‌‌ ప్రెజర్‌‌కు ముందు లక్షణాలంటున్నారు. ఇలా ఒత్తిడి ఎక్కువైతే మెదడులో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్‌‌ స్రోక్‌‌ వస్తుందని, ప్రాణాలకే ముప్పని హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు యంగర్స్‌‌కూ..

మామూలుగా 65 ఏండ్లు దాటిన వాళ్లకు బ్రెయిన్ స్ర్టోక్ ముప్పు ఎక్కువ. కానీ ఈమధ్య 40 ఏండ్ల లోపు వాళ్లూ స్ర్టోక్‌‌కు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌‌లో జరిగిన న్యూరాలజిస్టుల సదస్సులోనూ డాక్టర్లు ఈ విషయం వెల్లడించారు. ఇండియాలో చనిపోతున్న 40 ఏండ్ల లోపు వయసు వారిలో 15–20 శాతం బ్రెయిన్ స్ర్టోక్ వల్లే మరణిస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రతి లక్షలో 150 మంది బ్రెయిన్ స్ర్టోక్‌‌తో ఇబ్బంది పడుతున్నారని ఇండియన్ స్ర్టోక్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, డాక్టర్‌‌‌‌ సుభాష్‌‌కౌల్ తెలిపారు. ఒత్తిడి, స్మోకింగ్‌‌, డ్రగ్స్‌‌, ఆల్కహాల్ అలవాట్లతో బ్రెయిన్ స్ర్టోక్‌‌ బారినపడ్డ ఎంతో మంది యంగర్స్‌‌ను ఈ ఏడాది చూశామన్నారు.

మెదడుకు రక్తం సరఫరా ఆగితే..

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు చిట్లడం, రక్తం సరఫరా కాకుండా నాళాల్లో ఏదైనా అడ్డుపడటం వల్ల బ్రెయిన్ స్ర్టోక్ వస్తుంది. ఈ స్ట్రోక్‌‌కు హైపర్‌‌ ‌‌టెన్షన్‌‌, డయబెటీస్‌‌, ఓవర్ వెయిట్, హై కొలెస్ర్టాల్ వంటివి కారణమవుతుంటాయి. ఇలా మెదడులో రక్తం క్లాట్‌‌ అయితే దానితో సంబంధమున్న శరీర భాగాలు పనిచేయవు. ‘బ్రెయిన్‌‌లో వందల సంఖ్యలో రక్తనాళాలుంటాయి. వీటిల్లో ఏది దెబ్బ తిన్నా మెదడులోని ఏదో ఒక పార్ట్‌‌ పని చేయడం ఆగిపోతుంది. దాని ప్రభావం అప్పటికప్పుడు తెలియకపోవచ్చు. కాబట్టి స్ర్టోక్ వచ్చినట్టు గుర్తించడం కష్టం’ అని డాక్టర్‌‌‌‌ శ్రీకాంత్‌‌ వివరించారు. మతిమరుపు, ఉన్నట్టుండి శరీరంలోని ఏదో ఓ భాగం మొద్దుబారిపోవడం, ఓ వైపు చచ్చుబడిపోయినట్టు అనిపించడం, మాట్లాడేప్పుడు తత్తురుపాటు రావడం, ఉన్నట్టుండి కంటిచూపు మందగించడం, నిద్ర పట్టకపోవడం బ్రెయిన్ స్ర్టోక్‌‌కు ముఖ్య లక్షణాలు. ఇవి ఉన్నోళ్లు జాగ్రత్తగా ఉండాలని న్యూరాలజిస్ట్‌‌, డాక్టర్‌‌‌‌ సుభాష్‌‌కౌల్
హెచ్చరించారు.

వీళ్లకు రిస్క్‌‌ ఎక్కువ

ఉరుకులు పరుగుల ప్రపంచంలో నూటికి 90 మంది ఏదో ఒక ఒత్తిడికి గురవుతున్నారు. అలాగని వీళ్లందరికీ బ్రెయిన్ స్ర్టోక్ వచ్చే ప్రమాదం లేదు. ఒత్తిడితో నిద్రపట్టకపోవడం, బీపీ పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలొస్తే జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్‌‌, మితిమీరిన ఆల్కహాల్ అలవాటున్న వ్యక్తులు, బీపీ, షుగర్ పేషెంట్లు, కుటుంబంలో స్ర్టోక్‌‌ హిస్టరీ ఉన్నవాళ్లకు బ్రెయిన్ స్ర్టోక్ ముప్పు ఎక్కువ ఉంటుందన్నారు.

ఇవి చేస్తే బెటర్‌‌

స్మోకింగ్‌‌, ఆల్కహాల్‌‌, జంక్‌‌ ఫుడ్‌‌ అలవాట్లు మానుకోవాలి

రోజూ వ్యాయామం చేయాలి. బరువు తగ్గించుకోవాలి

తిండిలో కొవ్వులు, మసాలాలు, ఉప్పు తగ్గించాలి

రక్తపోటు, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయాలి

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి