నేడు క్రొయేషియాతో బ్రెజిల్​ క్వార్టర్​ ఫైనల్​

నేడు క్రొయేషియాతో బ్రెజిల్​ క్వార్టర్​ ఫైనల్​

గ్రూప్​ దశ, ప్రిక్వార్టర్స్​తో సాకర్​ ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించిన ఫిఫా వరల్డ్​కప్​లో హై ఓల్టేజ్​ సమరానికి తెరలేచింది. నేడు జరిగే క్వార్టర్​ఫైనల్లో బ్రెజిల్​తో క్రొయేషియా, అర్జెంటీనాతో నెదర్లాండ్స్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సాకర్​ వరల్డ్​ను శాసిస్తున్న  హీరోలు నెయ్​మార్​, మెస్సీతో పాటు.. అంతగా ప్రాచుర్యం లేని లూకా మోడ్రిచ్​, వర్జిల్​​ వాన్​ డిక్​ కూడా తమ టీమ్​లను గెలిపించేందుకు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు. మరి, క్వార్టర్స్​ గండాన్ని దాటి  సెమీస్​ చేరేదెవరో చూడాలి. 

దోహా:  బ్రెజిల్​.. ఈ భూమ్మీద ఫుట్​బాల్​ ఉన్నంతకాలం ఈ పేరు మారుమోగుతూనే ఉంటుందంటారు.  ఇప్పటి వరకు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002) విన్నర్​గా నిలిచిన బ్రెజిల్​.. ఆరో కప్​పై కన్నేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగే తొలి క్వార్టర్స్​లో యూరోపియన్​ ప్రత్యర్థి, గత రన్నరప్‌‌‌‌‌‌ క్రొయేషియాతో తలపడనుంది. ఆట, రికార్డులు, ప్లేయర్లు.. ఇలా ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్​లో బ్రెజిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్నది. హెడ్​ టు హెడ్​ రికార్డు ప్రకారం ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్​ల్లో బ్రెజిల్​ మూడు విజయాలు, ఓ డ్రాతో ముందంజలో ఉంది.  ఈ వరల్డ్​కప్​ గ్రూప్​–జిలో విన్నర్​గా నాకౌట్​కు చేరిన బ్రెజిల్.. ప్రిక్వార్టర్స్​లో సౌత్​ కొరియాను 4–1తో ఓడించింది. ప్రస్తుత ఫామ్​ ప్రకారం చూస్తే క్రొయేషియాను ఓడించడం బ్రెజిల్​కు పెద్ద కష్టం కాదు. వరల్డ్​ సాకర్​ హార్ట్​ బీట్​ నెయ్​మార్​తో పాటు తియాగో సిల్వ బ్రెజిల్​కు కొండంత అండ. కోచ్​ టిటే  స్ట్రాటజీలు అదనపు బలం. ఇక 2018లో  ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఫైనల్ చేరినా టైటిల్​ను సాధించలేకపోయిన క్రొయేషియా.. ఈసారి కప్​ను ముద్దాడాలని టార్గెట్​గా పెట్టుకుంది. లీగ్​ దశలో కెనడాపై 4–1తో నెగ్గిన ఆ జట్టు  జపాన్​తో ప్రిక్వార్టర్స్​ మ్యాచ్​లో 3–1(పెనాల్టీ)తో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఇక్కడ ప్లేయర్ల కంటే  కోచ్​ జట్కో డాలిచ్ వ్యూహాల​పైనే క్రొయేషియా ఎక్కువగా ఆధారపడనుంది.