ఈ సీజన్​లో మిల్లర్ల దోపిడీ ..1,500 కోట్లకు పైనే

ఈ సీజన్​లో మిల్లర్ల దోపిడీ ..1,500 కోట్లకు పైనే
  • సెంటర్​లో కాంటా అయిన వడ్లకు   సరిపడా పైసలు ఖాతాల్లో పడ్తలే
  • కొనుగోలు సెంటర్లలో తరుగు తీసినా మళ్లీ కోతలు పెట్టిన మిల్లర్లు
  • ఒక్కొక్కరి వద్ద రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు కటింగ్
  • సర్కార్ మౌనంపై మండిపడుతున్న రైతులు   

కరీంనగర్, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టింది మొదలు.. రైస్ మిల్లులకు వడ్లు తరలించడం, ధాన్యం డబ్బులు జమయ్యే వరకు అన్నదాతలు ఈ సీజన్ లో అడుగడుగునా దోపిడీకి గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కేజీల బస్తాను తరుగు పేరిట 43, 44 కిలోల చొప్పున కాంటా వేసిన విషయం తెలిసిందే. ఇలా క్వింటాకు  ఏడున్నర కిలోల నుంచి 10 కిలోల వరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు తీస్తే.. ఆ తర్వాత రైస్ మిల్లులకు వెళ్లాక మొత్తం రావాల్సిన డబ్బుల్లో రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు కోత పెట్టడం ఇప్పుడు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల తమ ఖాతాల్లో తక్కువ డబ్బులు జమ కావడం గుర్తించిన కొందరు రైతులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులను నిలదీస్తుండగా.. వారేమో తమకు సంబంధం లేదని, రైస్ మిల్లర్లనే అడగాలని తప్పించుకుంటున్నారు. 

డీసీఎంఎస్ ఆఫీసులో  ఖాజీపూర్ రైతుల ఆందోళన.. 

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో స్థానిక రైతులు ధాన్యం అమ్మారు. 40 కిలోల బస్తాకు ఇక్కడ 43 కిలోలు కాంటా వేశారు. ఇటీవల రైతులకు ధాన్యానికి సంబంధించిన పైసలు అకౌంట్లలో జమ అయ్యాయి. ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు కోత విధించినట్లు గుర్తించిన రైతులు సోమవారం కరీంనగర్ లోని డీసీఎంఎస్ ఆఫీసుకు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయమై సంబంధిత అధికారి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కోత విధించిన విషయం తమకు తెలియదని, రైస్ మిల్లర్ల దగ్గరే జరిగి ఉంటుందని, ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లో మళ్లీ వస్తామని తిరిగి వెళ్లారు.

ఈ సీజన్ లో రూ.1500 కోట్ల దోపిడీ..   

ఈ సీజన్ లో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. మిగిలిన ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 7034 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఆయా కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరిట 40 కేజీల బస్తాపై అదనంగా 3 నుంచి 4 కిలోలు వడ్లు తీసుకున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 65.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. తక్కువలో తక్కువ టన్నుకు సగటున 80 కిలోల చొప్పున తరుగు తీసినా సుమారు 5.80 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు నష్టపోయారు.వీటి విలువ సుమారు వెయ్యి కోట్లపైనే. నిజానికి కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయ్యాక మిల్లర్లు ఎలాంటి కొర్రీలు పెట్టడానికి వీల్లేదు. 

సర్కార్ అప్పగించిన వడ్లలో 68 శాతాన్ని కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా అప్పగించాలి. కానీ మిల్లర్లు తమ దగ్గరికి వచ్చిన ధాన్యాన్ని 17 శాతం తేమ, తాలు పేరిట 60 క్వింటాళ్లతో వెళ్లిన ట్రాక్టర్ లోడులో ఐదారు క్వింటాళ్ల కోత విధించారు. ఇలా క్వింటాకు మరో పది కిలోల కోత పడింది. తీరా మిల్లుకు తీసుకెళ్లిన ధాన్యాన్ని వెనక్కి తీసుకురాలేక అప్పట్లో రైతులు మిల్లర్లు చెప్పిన కటింగ్ కు ఒప్పుకుని రాగా.. మరికొందరికి తెలియకుండానే మిల్లర్లు కోత పెట్టారు. తాజాగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమయ్యాక విషయం తెలియడంతో లబోదిబోమంటున్నారు. ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటే సుమారు రూ.5 వేల వరకు మిల్లర్లు కట్ చేస్తున్నారనే ఆరోపణలు న్నాయి. మొత్తంగా మిల్లర్లు తరుగు పేరిట కోత పెట్టిన ధాన్యం విలువ, జమ చేసిన డబ్బుల్లో కోతను లెక్కిస్తే సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తంగా సర్కార్ పట్టింపులేనితనంతో  రైతుల కష్టార్జితం రూ.1500 కోట్ల విలువైన ధాన్యం రైస్ మిల్లర్ల గోదాముల్లోకి చేరింది.

వడ్ల డబ్బులు రూ.2వేల కోట్లు పెండింగ్

వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రూ.2వేల కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సివిల్‌ సప్లయీస్‌ డిపార్ట్​మెంట్​ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 11.10లక్షల మంది రైతుల నుంచి  రూ.13531.25 కోట్లు విలువైన 65.82లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన నిధులతో కలిసి ఇప్పటి వరకు సర్కారు రైతులకు రూ.11444 కోట్లు విడుదల చేసింది.  ఇప్పటికీ మరో 2వేల కోట్లకు పైగా నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రక్‌ షీట్‌ నమోదులో మిల్లర్ల పెత్తనం,
మరో వైపు ఓపీఎంఎస్‌ నమోదులో క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా రైతులకు వడ్ల డబ్బులు అందడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

నా పైసలు రూ.10 వేలు కట్ అయ్యాయి

డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో  నేను 646 బస్తాలు అమ్మిన. ధాన్యం కాంటా అయ్యాక ట్రక్ షీట్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు.  డబ్బులు అకౌంట్ లో పడతాయని చెప్పారు. తీరా చూస్తే నాకు రూ.5.32 లక్షలు రావాల్సి ఉండగా, రూ.5.22 లక్షలు మాత్రమే వచ్చాయి. రూ.10 వేలు కట్ అయ్యాయి. ఇదేంటని అడిగితే మాకేం సంబంధం లేదని రైస్ మిల్లర్ల దగ్గరే పొరపాటు జరిగి ఉండొచ్చంటున్నారు. ఇదంతా అధికారులు, మిల్లర్లు కలిసే చేస్తున్నారు. నిరుడు కూడా ఇలాగే జరిగింది.

- అంజన్ కుమార్, రైతు, ఖాజీపూర్