
బిగ్ బాస్ షో మధ్యలో ప్రకటనల కోసం ‘చిన్న బ్రేక్.. చిటికెలో వచ్చేస్తా’ అని చెబుతుంటారు నాగార్జున. అయితే తమిళనాట కమల్ హాసన్ మాత్రం బిగ్ బాస్ షోకే బ్రేక్ చెప్పారు. 2017 నుంచి ఇప్పటివరకూ ఏడు సీజన్స్ పూర్తి కాగా అన్నింటికీ కమలే హోస్ట్‌గా ఉన్నారు. అయితే త్వరలో మొదలవబోయే ఎనిమిదో సీజన్‌కు మాత్రం హోస్ట్ మారబోతున్నాడు. తాను ఈ షో నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్టు మంగళవారం కమల్ ప్రకటించారు. ‘ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న బ్రేక్. నాకున్న సినిమా కమిట్‌మెంట్స్ వల్ల రాబోయే సీజన్‌ను హోస్ట్ చేయడం లేదనే విషయాన్ని బాధతో చెబుతున్నా.
ఈ షో ద్వారా ఇంటింటికి చేరువవడం గర్వంగా భావిస్తున్నా. హోస్ట్‌గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా’ అంటూ ఓ నోట్ విడుదల చేశారు కమల్. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’లో నటిస్తున్న ఆయన.. మరోవైపు నిర్మాతగానూ బిజీ అయ్యారు. ఇక కమల్ బ్రేక్ తీసుకోవడంతో బిగ్ బాస్ సీజన్ 8ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారా అనే ఆసక్తి నెలకొంది.